ఏపీ స్థానిక ఎన్నికల్లో రసవత్తర ట్విస్ట్.. టీడీపీ, జనసేన లీడర్ల తోపులాట !

ఏపీ స్థానిక ఎన్నికల్లో రసవత్తర ట్విస్ట్.. టీడీపీ, జనసేన లీడర్ల తోపులాట !

ఏపీలో స్థానిక పోరు ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. టీడీపీ-జనసేన అగ్ర నాయకత్వాలు దోస్తీ చేస్తుంటే ఈ రెండు పార్టీలకు చెందిన లోకల్ కేడర్ మాత్రం గొడవలు, కుమ్ములాటలతో సై అంటే సై అంటున్నాయి. ఇలాంటి ఘటనే.. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. మన్యం జిల్లా జీఎం వలస మండలం అరుణాడ గ్రామంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకుల మధ్య సయోధ్య కుదరలేదు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పరిణామాలతో స్థానికంగా జనసేన, టీడీపీ నాయకుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలోనే..శనివారం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచారానికి అరుణాడ గ్రామానికి వెళ్లారు. స్థానిక జనసేన నాయకులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నట్లు సమాచారం.

ప్రచారానికి వచ్చిన టీడీపీ నాయకులను వెనక్కి వెళ్లిపోవాలని జనసేన నాయకులు తేల్చి చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. జనసేన నాయకులు అయినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో టీడీపీ నాయకులు ప్రచారాన్ని కొనసాగించకుండా అర్థాంతరంగానే వెనుదిరిగినట్లు తెలిసింది.

టీడీపీ, జనసేన, బీజేపీ.. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా సమష్టిగా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని అధిష్టానాలు పిలుపునిస్తుంటే స్థానిక పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.