న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతోన్న ఈ సమావేశానికి మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి పార్టీల సభ్యులు హాజరయ్యారు.
సర్ ప్రక్రియలోని అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికేనని.. ఇందులో ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ నాశనం చేస్తోందని విమర్శించారు.
మోడీ సర్కార్ ఓట్ చోరీ, సంసద్ చోరీ, పార్టీ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. సర్ పేరుతో ఎన్నికల సంఘం బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెర వెనక నుంచి ఓట్ చోరీని నడిపిస్తున్నారని అన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ ఓట్ చోరీకి పాల్పడుతోన్న వారిని వదిలిపెట్టొద్దని కోరారు.
ఓట్ చోరీపై ప్రజలు, యువత, స్టూడెంట్స్, మహిళలు, కార్మికులు అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో ఎంపీలు అభిశంసన పెట్టిన జ్ఞానేష్ కుమార్ను మోడీ కాపాడుతున్నాడని అన్నారు. దేశంలో ప్రజల ఓటు హక్కు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ చోరీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే.. ఈసీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదన్నారు.
సర్ అక్రమాలపై రాష్ట్రప్రతిని కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణకు బీజేపీకి భయమెందుకని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
