తెలంగాణలో ఐటీ జోరు: పోచారంలో ఇన్ఫోసిస్ కొత్త సాఫ్ట్‌వేర్ బ్లాక్

తెలంగాణలో ఐటీ జోరు: పోచారంలో ఇన్ఫోసిస్ కొత్త సాఫ్ట్‌వేర్ బ్లాక్

టెక్ రంగంలో దూసుకుపోతున్న ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా శుక్రవారం అక్టోబర్ 30న పోచారంలోని తమ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కొత్తగా నిర్మించిన 11 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో అత్యాధునిక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

సుమారు 450 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్‌లో ఇప్పటికే 7 సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉండగా.. సుమారు 46 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా అందుబాటులో ఉంది. తాజా విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కొత్త బ్లాక్ ద్వారా అదనంగా మరో 10వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 

ఈ పోచారం డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, రిటైల్, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ రంగాల్లోని గ్లోబల్ క్లయింట్‌లకు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా AI, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ, ఇంజనీరింగ్, నెక్స్ట్-జెన్ డిజిటల్ సర్వీసెస్‌లో ఇన్ఫోసిస్ సామర్థ్యాలను ఈ సరికొత్త విస్తరణ మరింత బలోపేతం చేయనుంది.

►ALSO READ | ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 36 వేల మందితో భారీ పోలీసు బందోబస్తు!

ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా మాట్లాడుతూ.. క్లయింట్‌లకు అత్యాధునిక సేవలను అందించడానికి.. ఉద్యోగులకు కొత్త టెక్నాలజీల్లో పట్టు పెంచేందుకు ఈ కొత్త బిల్డింగ్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఎంటర్‌ప్రైజెస్ వేగంగా ఏఐ వైపు అడుగులు వేస్తున్న వేళ.. ప్రపంచ స్థాయి ప్రతిభను, అధ్యాధునిక మౌలిక సదుపాయాలను ఒకచోట చేర్చే వ్యూహాత్మక కేంద్రంగా ఈ క్యాంపస్ మారుతుందని అన్నారు. హైదరాబాద్ టెక్ రంగంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక యువతకు కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది.