ప్రస్తుతం AI టెక్నాలజీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఏఐ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేసేందుకు కంపెనీలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'డైమెన్షనల్' అనే స్టార్టప్ కంపెనీ ఒక సరికొత్త ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. రోబో కుక్కలను సిటీ వీధుల్లో నడిపించేందుకు అదేనండి వాకింగ్ కి తీసుకెళ్లేందుకు ఆసక్తి గల వ్యక్తుల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు నాలుగు కాళ్ల రోబోటిక్ కుక్కలను శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లోని కంపెనీ చెప్పిన మార్గంలో నడిపించాల్సి ఉంటుంది. ఒక్కో షిఫ్ట్ సుమారు 4 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి ఎలాంటి రోబోటిక్స్ అనుభవం అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఎంపికైన వారికి కంపెనీయే స్వయంగా పెయిడ్ ట్రైనింగ్ కూడా ఇస్తుందట. ట్రైనింగ్ పూర్తి కాగానే వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని ప్రకటనలో పేర్కొనటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ జాబ్ పేరు మోతమోగిపోతోంది.
ఈ ఉద్యోగానికి కంపెనీ ఇస్తున్న వేతనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోబో కుక్కలను వాకింగ్ తీసుకెళ్లే ఈ జాబ్‌కు గంటకు 20 డాలర్లు అంటే భారత కరెన్సీలో గంటకు అక్షరాలా రూ.2వేలు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి షిఫ్ట్ పూర్తయిన వెంటనే డబ్బులు చెల్లించడం ఈ ఉద్యోగ ప్రత్యేకత. "వెంటనే పని ప్రారంభించండి.. ప్రతి షిఫ్ట్ ముగిసిన వెంటనే జీతం పొందండి" అంటూ డైమెన్షనల్ కంపెనీ తన జాబ్ పోస్టింగ్‌లో పేర్కొంది.
నిజానికి రియల్ వరల్డ్‌లో ఏఐ సిస్టమ్స్ మరింత సులభంగా నావిగేట్ చేయడానికి, వీధుల్లోని సవాళ్లను అధిగమించడానికి ఈ డేటాను సేకరిస్తోందంట అమెరికాలోని స్టార్టప్ కంపెనీ. రోబో డాగ్స్ సహాయంతో ఏఐని సరికొత్త మార్గంలో శిక్షణ ఇస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. రోబోట్‌ను వాకింగ్‌కు తీసుకెళ్తూ గంటల వ్యవధిలో వేల రూపాయలు సంపాదించే ఈ సరికొత్త అవకాశం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
