Cult Day 1 Collections : విశ్వక్ సేన్ 'కల్ట్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడం సాధ్యమేనా?

Cult Day 1 Collections : విశ్వక్ సేన్ 'కల్ట్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడం సాధ్యమేనా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం 'కల్ట్'. భారతీయ సినిమా చరిత్రలో తొలి స్లాషర్ ఫిల్మ్ అంటూ భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ శుక్రవారం( అక్టోబర్ 30, 2026 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెరపై రక్తపాతం, హింసతో భయపెట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. విడుదలకు ముందే పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్లు పరిమితంగా ఉండటంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.

సినీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'కల్ట్' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.95 లక్షలు కాగా, ఇండియా గ్రాస్ రూ.1.10 కోట్లు. ఓవర్సీస్ నుంచి మరో రూ.20 లక్షలు వచ్చినట్లు సమాచారం. మొదటి రోజు దేశవ్యాప్తంగా 1,240 షోల ద్వారా రూ.95 లక్షలకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్కో షోకు సగటున రూ.7,661 మాత్రమే రావడం గమనార్హం.

ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తొలి రోజు సగటు ఆక్యుపెన్సీ 19.82 శాతంగా నమోదైంది. ఉదయం షోలకు 13.55 శాతం, మధ్యాహ్నం 15.45 శాతం, సాయంత్రం 16.91 శాతం ఆక్యుపెన్సీ రాగా.. నైట్ షోల్లో మాత్రం 29.82 శాతానికి పెరిగింది. మరోవైపు అదే రోజు విక్టరీ వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47' రిలీజ్ కావడంతో భారీ వసూళ్లు సాధించడంతో 'కల్ట్'కు గట్టి పోటీ ఎదురైంది.

ఇక ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.25 నుంచి -30 కోట్లు కాగా, థియేట్రికల్ బిజినెస్ రూ.10 కోట్ల వరకు జరిగినట్లు అంచనా. బ్రేక్ ఈవెన్ చేరాలంటే దాదాపు రూ.11 కోట్ల షేర్, అంటే సుమారు రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. తొలి రోజు వసూళ్లను చూస్తే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద సవాలే అన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

అయితే విశ్వక్ సేన్ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, టెక్నికల్ వర్క్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. కథనం, అతిగా అనిపించిన హింసాత్మక సన్నివేశాలపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ వీకెండ్‌ పై చిత్ర బృందం మరిన్ని ఆశలు పెట్టుకుంది. మరి మౌత్ టాక్ పుంజుకుని 'కల్ట్' కలెక్షన్లకు ఊపిరి పోస్తుందా? లేక బాక్సాఫీస్ దగ్గర ఈ ప్రయోగం నిరాశగానే మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.