రాహుల్ మార్చ్‎కు నో పర్మిషన్.. లాస్ట్ మినిట్‎లో ఢిల్లీ పోలీసుల ట్విస్ట్

రాహుల్ మార్చ్‎కు నో పర్మిషన్.. లాస్ట్ మినిట్‎లో ఢిల్లీ పోలీసుల ట్విస్ట్

న్యూఢిల్లీ: ఇండియా కూటమి నవంబర్ 1న రాంలీలా మైదాన్‎లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్నాట్ ప్లేస్ నుంచి చేపట్టాలనుకున్న యాత్రకు మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు అందలేదని తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు, పండుగ సీజన్ నేపథ్యంలో కన్నాట్ ప్లేస్‎లో రాహుల్ మార్చ్‎కు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. 

నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారత కూటమి నిర్వహించనున్న భారీ ర్యాలీకి ముందుగా ఢిల్లీలో జరిగే మార్చ్‌లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కన్నాట్ ప్లేస్ సమీపంలోని మింటో రోడ్ జంక్షన్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర అజ్మేరీ గేట్ గుండా వెళ్లి రామ్‌లీలా మైదాన్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో తనతో కలిసి నడవాలని రాహుల్ కోరారు. అయితే, కన్నాట్ ప్లేస్‏లో రాహల్ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. 

నవంబర్ 1న రాంలీలా మైదాన్‎లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీకి అనుమతి ఉన్నట్లు తెలిపారు. సభ ముగిసిన వెంటనే జనం వెళ్లిపోవాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇండీ కూటమికి పోలీసులు షరతు విధించారు. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అవకతవకలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‎తో నవంబర్ 1న రాంలీలా మైదాన్‎లో ప్రతిపక్ష ఇండీ కూటమి భారీ ర్యాలీ చేపట్టనున్న విషయం తెలిసిందే. 

కాంగ్రెస్ నేతృత్వంలో జరగనున్న ఈ ర్యాలీకి ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోలీసులు.. భారీగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. సభా ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు, నిఘా వ్యవస్థలు, సిబ్బందిని మోహరించి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రామ్‌లీలా మైదాన్‌లో సుమారు 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ ప్రాంగణంలోని కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 

పర్యవేక్షణ ఏర్పాట్లలో భాగంగా ఏఐ ఆధారిత నిఘా, ఫేస్ రికగ్నైజ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా వినియోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడటానికి, కేంద్ర జిల్లా పోలీసులు, ఇతర జిల్లా యూనిట్ల సిబ్బందితో పాటు పారామిలిటరీ బలగాలను సభా ప్రాంగణం, రాంలీలా పరిసర ప్రాంతాలలో మోహరిస్తారు. ఇండీ కూటమి నేపథ్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు.