హైదరాబాద్‌ను కుండపోత వాన ముంచెత్తింది. శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సిటీలో నాన్ స్టాప్‌గా వర్షం దంచికొట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జనం అల్లాడిపోతున్న వేళ రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో భాగ్యనగరం జలమయమైంది.
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సిటీలోని రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సరిగ్గా ఆఫీసులు ముగిసి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం దంచికొట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 100 మీటర్ల దూరం ప్రయాణించాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. దీంతో ఐటీ ఎంప్లాయిస్ నరకయాతన అనుభవించారు.
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు.
ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడిందంటే..?
బహదూర్ పూర్-8.5
మాదాపూర్-7.1
కీసర-6.7
షేక్‌పేట్-6.4
చార్మినార్-6.2
కూకట్ పల్లి-5.5
ఆసిఫ్ నగర్-5.2
నాంపల్లి 5.8
శేరిలింగపల్లి-4.9
గండిపేట్-4.8
రాజేంద్ర నగర్-4.3
బండ్లగూడ-4.2
సరూర్ నగర్-4.1
మేడిపల్లి-4.0
అంబర్ పేట్-4.0
ఉప్పల్-4.0
సైదాబాద్-3.7
అబ్దుల్‌పూర్‌మెట్-3.7
