హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలతో నవంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లినుంది. సర్ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండీ కూటమి మార్చ్‌కు పోటీగా నవంబర్ 1న బీజేపీ సైతం భారీ ర్యాలీకి సిద్ధమవుతోంది.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు, వారి కుటుంబ సభ్యులతో సహా సుమారు 5 వేల మందితో భారీ యాత్రను నిర్వహించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ యాత్రకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నాయకత్వం వహించనున్నారు. ఆదివారం (నవంబర్ 1) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. బీజేపీకి చెందిన సీనియర్ సిక్కు నాయకులతో సహా పలువురు ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | INS విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ జెట్ ల్యాండింగ్ సక్సెస్.. నేవీ చరిత్రలో మరో హిస్టారికల్ మైల్స్టోన్
1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు కాల్చి చంపిన తర్వాత నవంబర్ 1న సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాకాండ పర్యవసానంగా దేశవ్యాప్తంగా వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోగా ఎన్నో కుటుంబాలు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డాయి. ఈ క్రమంలోనే నవంబర్ 1న సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు, వారి కుటుంబ సభ్యులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది.
