ఆలోచనలతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేసే టెక్నాలజీ.. ఎలాన్ మస్క్ 'టెలిపతి' ప్రత్యేకతలు ఇవే

ఆలోచనలతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేసే టెక్నాలజీ.. ఎలాన్ మస్క్ 'టెలిపతి' ప్రత్యేకతలు ఇవే

టెక్నాలజీ ప్రపంచంలో మరో అద్భుతానికి రంగం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ ఇప్పుడు మానవ మెదడును నేరుగా టెక్నాలజీతో అనుసంధానించే దిశగా అడుగులు వేశారు. టెన్షన్ పెట్టే కీబోర్డులు, మాటలతో పనిలేకుండా కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలతో సంభాషించేలా న్యూరాలింక్(Neuralink) తొలి కన్స్యూమర్ ప్రొడక్ట్‌ను ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. "టెలిపతి" పేరుతో తీసుకొస్తున్న ఈ సరికొత్త బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఈ అత్యాధునిక పరికరం ద్వారా మానవ ఆలోచనల వేగమే కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయడానికి ప్రధాన సాధనంగా మారుతుంది. దీనిపై మస్క్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కేవలం ఆలోచించడం ద్వారానే కంప్యూటర్లు, మనుషులతో హై-స్పీడ్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ అవుట్‌పుట్ బ్యాండ్‌విడ్త్ అత్యంత వేగవంతమైన మనుషుల మాటలు, టైపింగ్ వేగాన్ని కూడా మించిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ప్రారంభం నుంచి క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఈ టెక్నాలజీకి ఇప్పుడు 'టెలిపతి' అనే అధికారిక రూపం లభించింది.

ఈ టెలిపతి పరికరం వెనుక న్యూరాలింక్‌కు చెందిన 'N1' బ్రెయిన్ ఇంప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో 64 ఫ్లెక్సిబుల్ త్రెడ్లపై విస్తరించి ఉన్న 1,024 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ను అత్యంత సూక్ష్మంగా గ్రహిస్తాయి. 'R1' సర్జికల్ రోబోట్ సహాయంతో ఈ త్రెడ్లను కదలికలను నియంత్రించే మోటార్ కార్టెక్స్‌లో అమర్చుతారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా పక్షవాతంతో బాధపడుతున్న రోగులు కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్ కర్సర్‌ను కదిలించడం, మౌస్ ముట్టుకోకుండా చెస్ ఆడటం, డిజైన్ సాఫ్ట్‌వేర్‌లను ఆపరేట్ చేయడం వంటి అద్భుతాలు చేసి చూపించారు. భవిష్యత్తులో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయిన వారు సైతం మళ్లీ నడిచేలా చేయడానికి ఈ టెక్నాలజీ సహకరిస్తుందని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.

►ALSO READ | రోబో కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్తే గంటకు రూ.2వేలు జీతం.. స్టార్టప్‌ క్రేజీ జాబ్ ఆఫర్!

కేవలం కమ్యూనికేషనే కాకుండా.. ఎండ్‌-యూజర్ల భాగస్వామ్యంతో వాయిస్ యాక్టివిటీ డిటెక్షన్ లాంటి సరికొత్త ఫీచర్లను కూడా న్యూరాలింక్ పరీక్షిస్తోంది. మెదడు సంకేతాలను విజువలైజ్ చేసే టూల్స్‌తో పాటు, కేవలం "హే న్యూరాలింక్" అని మనసులో అనుకుంటే చాలు పనులు చేసేలా 'గ్రోక్' ఏజెంట్ అనుసంధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఎలాన్ మస్క్.