జపాన్‌కు చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాగాలాండ్‌లోని ఓ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు విద్యార్థులు ఇచ్చిన ఘన స్వాగతం అందరినీ ఆకట్టుకుంటోంది. కవాసకి కంపెనీ రిక్రూట్‌మెంట్ టీమ్ కాలేజీకి రావడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమం 'నాగాలాండ్-జపాన్ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
కవాసకి టీమ్‌కు విద్యార్థుల అదిరిపోయే స్వాగతం
నాగాలాండ్‌లోని ఓ కాలేజీకి కవాసకి కంపెనీ రిక్రూట్‌మెంట్ టీమ్ వచ్చిన సమయంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వారికి స్వాగతం పలికారు. కంపెనీ ప్రతినిధులు కాలేజీలోకి అడుగుపెట్టగానే విద్యార్థులు చప్పట్లు కొడుతూ, కేరింతలు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాదు, జపాన్ సంప్రదాయమైన 'ఒజిగి' పద్ధతిలో వంగి నమస్కరిస్తూ కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు. విద్యార్థులు వరుసగా నిలబడి ప్లేస్‌మెంట్ ఆడిటోరియం వరకు వారికి స్వాగతం పలికారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం ఆరుగురు విద్యార్థులు కవాసకి కంపెనీకి ఎంపికైనట్లు సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
విద్యార్థులు కవాసకి టీమ్‌కు స్వాగతం పలికిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీ మా కాలేజీకి రావడంపై విద్యార్థులు చూపించిన ఉత్సాహం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో నాగాలాండ్ యువతలో ఉద్యోగ అవకాశాల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాలనే యువత ఆకాంక్షకు ఈ కార్యక్రమం ఒక ఉదాహరణగా నిలిచింది.
నెటిజన్ల కామెంట్స్ ఇవే!
ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు వారి అభిప్రాయాలను షేర్ చేసారు. ఓ నెటిజన్ "సిక్కిం నుంచి అభినందనలు. నిజంగా ఇది చాలా మంచి ప్రయత్నం" అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్.. "కేవలం నాగాలాండ్‌లోనే ఎందుకు? మిగతా భారతదేశంలో ప్రతిభ ఉన్నవారు లేరా ? ఇది ప్రాంతీయ వివక్ష కాదా ?" అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కవాసకి కంపెనీ గురించి..
కవాసకి హెవీ ఇండస్ట్రీస్ జపాన్‌కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ. ఈ కంపెనీ కేవలం బైక్స్ తయారీకే పరిమితం కాకుండా విమాన రంగం, ఇంధన వ్యవస్థలు, పారిశ్రామిక పరికరాల తయారీలో కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా కవాసకి బైక్స్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మొత్తానికి నాగాలాండ్ విద్యార్థులు కవాసకి కంపెనీ టీమ్‌కు ఇచ్చిన స్వాగతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో ఆరుగురు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం ఈ కార్యక్రమంలో మరో విశేషంగా నిలిచింది.
