Ravindra Jadeja: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భవిష్యత్తుపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. న్యూజిలాండ్‌తో నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టులో జడేజాకు చోటు దక్కకపోవడం, అతని స్థానంలో అక్షర్ పటేల్‌కే మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఛేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) కీలక వ్యాఖ్యలు చేశాడు. జడేజా వన్డే కెరీర్ దాదాపు ముగిసిపోయిందని, వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో అక్షర్ నే ప్రధాన ఆల్‌రౌండర్‌గా బోర్డు భావిస్తోందని పుజారా విశ్లేషించాడు.
టెస్టులకే పరిమితం కాలేదు: ఛేతేశ్వర్ పుజారా
జియోస్టార్ (JioStar) చర్చా కార్యక్రమంలో పుజారా మాట్లాడుతూ.. రవీంద్ర జడేజా ఎంపికపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిపాడు. ఒకవేళ జడ్డూని వన్డేల్లో కొనసాగించాలనుకుంటే.. ఈ న్యూజిలాండ్ సిరీస్‌కే ఎంపిక చేసేవారు. అక్షర్ పటేల్ వన్డేల్లో ప్రధాన ఆల్‌రౌండర్‌గా స్థిరపడ్డాడు కాబట్టి, జడేజాకు మేనేజ్‌మెంట్ ఇప్పటికే విషయాన్ని స్పష్టం చేసి ఉంటుంది. వయసు రీత్యా ఆయనను ఇకపై కేవలం టెస్టు క్రికెట్‌కే పరిమితం కావాలని, వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టీ20లు)లో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఉంటారు.. ఇప్పటికే టీ20లకి రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి, వన్డే కెరీర్‌కు కూడా ఇది ఎండ్ కార్డే అని పుజారా పేర్కొన్నాడు.
ఆపద్బాంధవుడిగా జడేజానే బ్యాకప్: అభిషేక్ నాయర్
అయితే టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) మాత్రం పుజారా అభిప్రాయంతో పూర్తి స్థాయిలో ఏకీభవించలేదు. జడేజాను ఒక ఇన్సూరెన్స్ పాలసీలా మేనేజ్‌మెంట్ ఉంచుకుంటుందని అభిప్రాయపడ్డాడు. జడేజా రెగ్యులర్ స్క్వాడ్‌లో లేకపోవచ్చు.. కానీ వన్డే ప్రపంచకప్‌కు ముందు అక్షర్ పటేల్‌కు ఏమైనా గాయమైతే.. మేనేజ్‌మెంట్ మైండ్‌లోకి వచ్చే మొదటి పేరు జడేజానే.. అక్షర్ తర్వాత టీమిండియాకు అంతటి నమ్మకమైన స్పిన్ ఆల్‌రౌండర్ వేరే ఎవరూ లేరు.. కాబట్టి జడేజా ఒక పర్ఫెక్ట్ 'ఇన్సూరెన్స్ పాలసీ'లా అందుబాటులో ఉంటాడని నాయర్ తెలిపాడు.
వన్డేల్లో 200లకు పైగా వికెట్లు, 2,700 పైచిలుకు పరుగులు చేసిన 37 ఏళ్ల రవీంద్ర జడేజాను భారత్ మేనేజ్‌మెంట్ పక్కనబెట్టి, అక్షర్ పటేల్‌ను పూర్తిస్థాయిలో ప్రోత్సహించడంపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
