మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ గుట్టల్లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సెలవు కావడంతో యాప్రాల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా గడిపేందుకు మల్కారం క్వారీ గుట్టల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు క్వారీలోని నీటిలోకి దిగారు. అయితే వారిలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
మృతులను సీవీఆర్ కాలేజీలో చదువుతున్న రోహిత్ (18), సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న సయాన్ (18)గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.విద్యార్థుల ఆచూకీ కోసం హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు విద్యార్థుల మృతితో యాప్రాల్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
