- టైటిల్ : బత్తా
- కాస్ట్ : విజయ్ సేతుపతి, మాస్టర్ సాయి పృథ్వీరాజ్, లిజోమోల్ జోస్
- డైరెక్షన్ : బాలాజీ తరణితరణ్
- ప్లాట్‌ఫాం : నెట్‌ఫ్లిక్స్
అది1986. బత్తా (విజయ్ సేతుపతి) అంటే ఊళ్లో అందరికీ భయమే. జ్యోతి, సింగరం, రాజేంద్ర, పెద కొండయ్యలు బత్తాకు బద్ధశత్రువులు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. బత్తా పనుల గురించి స్కూల్ పిల్లలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఆ కథలు శబరి (సాయి పృథ్వీరాజ్) అనే చిన్నారిపై బలమైన ప్రభావం చూపిస్తాయి.
ఓసారి అనుకోకుండా శబరి కారణంగా బత్తా కాలికి గాయమవుతుంది. ఆ విషయం బత్తాకు తెలియకపోయినా.. తన వల్లే గాయమైందనే భయంతో శబరి ఉంటాడు. మరోసారి సెలవు రోజున టీచర్ స్టాఫ్ రూమ్‌లో దాచిన తన బొమ్మను తీసుకురావడానికి స్కూల్‌కు వెళ్లిన శబరి.. అక్కడి వాష్‌రూమ్‌లో ఉన్న బత్తాను గమనించకుండా బయటనుంచి గొళ్లెం పెట్టేస్తాడు. లోపల ఉన్నది బత్తా అని తెలిసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు కూతురి పెద్దమనిషి వేడుకకు వెళ్లాల్సిన బత్తా బయటకు రాలేక లోపలే చిక్కుకుపోతాడు.
అతనికోసం అనుచరులు, కుటుంబ సభ్యులు, చివరకు పోలీసులు కూడా వెతుకుతుంటారు. కానీ స్కూల్‌కు సెలవులు కావడంతో లోపల బత్తా ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియదు. శబరి మాత్రం తలుపు కింది నుంచి రస్కులు అందిస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడిచిపోతుండటంతో బత్తా అక్కడి నుంచి ఎలా బయటపడతాడు? శబరి అతనికి సాయం చేస్తాడా? అసలు బత్తా ఆ స్కూల్‌కు ఎందుకు వెళ్లాడు? అన్నదే మిగతా కథ.
