నగర జీవనంలో సొంత ఇంటి చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉండటమే అరుదు. బాల్కనీలో నాలుగు కుండీలు పెట్టుకోవాలన్నా స్థలం సరిపోదు. అలాంటిది ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ మనమే పండించుకోవాలంటే సాధ్యమవుతుందా?
వ్యవసాయ భూమి కొనకుండానే ఆ కలను నిజం చేసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. అదే ‘రెంట్ ఏ ఫార్మ్’ విధానం. అంటే, కూరగాయలు పండించుకోవడానికి పొలాన్ని అద్దెకు తీసుకోవడం!
మార్కెట్‌లో కూరగాయలు కొనేటప్పుడు అవి ఎక్కడ పండాయి? సాగులో ఎలాంటి పురుగుమందులు వాడారు? నిజంగా సేంద్రియ పద్ధతుల్లో పండించినవేనా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడంతో పాటు, దాని సాగులో భాగస్వాములు కావాలనే ఆసక్తి పెరుగుతోంది. అయితే, నగరాల్లో స్థలం, సమయం లేక సొంతంగా కూరగాయలు పండించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసమే పొలాలను అద్దెకు ఇచ్చే విధానం ప్రాచుర్యంలోకి వస్తోంది.
సాగు బాధ్యత వారిదే!
పంజాబ్‌లోని ‘గిల్ ఆర్గానిక్స్’ ఈ విధానాన్ని వినూత్నంగా అమలు చేస్తోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మంతాజ్ సింధు ఆలోచనకు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో చూసిన విధానం ప్రేరణగా నిలిచింది. ఇక్కడ వినియోగదారులు ఆరు నెలల కాలానికి సుమారు 150 చదరపు గజాల స్థలాన్ని తమ కోసం కేటాయించుకోవచ్చు. తమకు కావాల్సిన కాలానుగుణ కూరగాయలను ఎంపిక చేసుకుంటే చాలు. వాటిని పండించడం, సంరక్షించడం వంటి పనులన్నీ సంస్థ సిబ్బందే చూసుకుంటారు.
పండిన కూరగాయలను ప్రతి వారం ఇంటికే పంపిస్తారు. నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబానికి అవసరమయ్యే వారపు కూరగాయలు, సలాడ్ అవసరాల్లో సుమారు 60–70 శాతం వరకు ఈ విధానం ద్వారా అందించవచ్చని సంస్థ చెప్తోంది.
ప్రస్తుతం పాటియాలా, చండీగఢ్ పరిసర ప్రాంతాలు, లూధియానాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరు నెలల చందా పాటియాలాలో రూ.35 వేలు, చండీగఢ్ పరిసర ప్రాంతాలు, లూధియానాలో రూ.40 వేలుగా ఉంది. సుమారు 200 కుటుంబాలకు సేవలందించే సామర్థ్యం ఉన్న ఈ సంస్థకు దాదాపు 3,000 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం ఈ విధానంపై ఆసక్తిని సూచిస్తోంది.
స్వయంగా సాగు చేయాలనుకుంటే!
కూరగాయలు పండించడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకునేవారికి తమిళనాడులోని ‘వక్సానా ఫార్మ్స్’ మరో అవకాశం కల్పిస్తోంది. రెట్టనై గ్రామం సమీపంలోని ఈ14 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, వరి, పప్పుధాన్యాలు సాగు చేస్తారు. ఇక్కడ సుమారు 3,000 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ.15 వేల అద్దెకు తీసుకోవచ్చు. నీరు, విద్యుత్, కూలీల సాయం వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు.
అందరికీ సాధ్యమేనా?
ఈ విధానం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, కూరగాయలు కొనడం కంటే చౌకగా ఉంటుందని చెప్పలేం. అద్దె, రవాణా, పొలం అందుబాటులో ఉన్న ప్రాంతం వంటి అంశాలను పరిశీలించాలి. అయినా, వ్యవసాయ భూమి కొనలేని వారికి, సాగు నేర్చుకోవాలనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే..కథను హామీ పత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
