మానవ జీవితంలో ఎంతటివారికైనా కష్టాలు, సుఖాలు అత్యంత సహజం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, స్థితప్రజ్ఞతతో జీవించాలంటారు పెద్దలు. ‘నాస్తి రత్నమఖండితమ్’ అంటాడు చాణక్యుడు. ‘ఖండించబడని రత్నం ఉండదు’. అంటే రాయిని బాగా సాన పెట్టిన తరువాతే రత్నంగా రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా మానవ జీవితంలో ఎంతటివారికైనా కష్టాలు సహజం. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటిని అధిగమించాలి.
అనగనగా ఒక ఊరిలో రాజు, బాలు అని ఇద్దరు స్నేహితులున్నారు. వారిద్దరూ బాల్యం మొదలు, వృద్ధులయ్యే వరకూ స్నేహంగా మెలిగారు. బాలు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కాని బాలు వాటిని చిరునవ్వుతో ధైర్యం కోల్పోకుండా అధిగమిస్తూ వచ్చాడు. అది చూసి రాజుకి ఆశ్చర్యం కలుగుతుండేది.
‘బాలూ! నీకు ఎంతటి కష్టం వచ్చినా, నువ్వు ఏమాత్రం బాధపడకుండా, నవ్వుతూనే ఉంటావు. అది ఎలా సాధ్యం’ అని ఓనాడు ప్రశ్నించాడు. అందుకు బాలు, ‘రాజూ! అదేమంత కష్టం కాదు. రానున్న కష్టం ఎలాగూ రాకమానదు. మనం బాధపడినా, బాధ పడకపోయినా తప్పదు. కష్టం అనే కత్తి దూసుకొస్తుంటే, జాగ్రత్తగా దాని పిడి పట్టుకోవాలి. అలాకాకుండా భయపడుతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తే. కత్తి పదును భాగం చేతికి తగిలి, గాయమై రక్తం స్రవిస్తుంది. భయం, పిరికితనం, నిస్పృహ... వంటి లక్షణాల వల్ల నిస్సత్తువ వస్తుంది.
మనిషిలోకి పిరికితనం ప్రవేశిస్తే.. మనిషి చేతకానివానిలా, జీవచ్ఛవంలా మారిపోతాడు. అతనిలోని ఉత్సాహం నశిస్తుంది. ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి ఆ ధైర్యమనే ఆయుధంతోనే తన బాధ్యతలను, కర్తవ్యాలను ఏదో ఒకవిధంగా నెరవేరుస్తాడు. నేను పిరికితనాన్ని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పిన మాటలను అనుసరిస్తాను’ అన్నాడు బాలు.
మహాభారతంలో ద్రౌపదిని, కుంతీదేవిని మించిన ధైర్యవంతులు మరొకరు కనపడరు. పాండవులు చిన్నపిల్లలుగా ఉన్న సమయంలోనే పాండురాజు గతించాడు. ఆయనతో పాటు మాద్రి సహగమనం చేసింది. ఐదుగురు పిల్లల్ని ఎంతో ధైర్యంతో పెంచింది కుంతి. పాండురాజు సంపాదించిన రాజ్యాన్ని దుర్యోధనుడు అక్రమంగా హస్తగతం చేసుకున్నాడు. పాండవులను అడవులపాలు చేశాడు. దాయాదుల ఇళ్లల్లో అవమానాలు పడుతూ కూడా ధైర్యాన్ని కోల్పోలేదు కుంతి.
ఇక ద్రౌపది విషయానికి వస్తే
మాయాద్యూతంలో గెలిచిన దుర్యోధనుడు, ద్రౌపదిని సభలోకి పిలిపించి, నిండు కొలువులో అందరి ఎదుట వస్త్రాపహరణం చేయించడానికి ప్రయత్నించాడు. అంతటి అవమానం జరిగినా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ఆవిడ. అరణ్యవాసం సమయంలో కటిక నేల మీద పడుకుంది.
అడవులలో దొరికే కందమూలాలు భుజించింది. ఆ సమయంలో సైతం తమను చూడటానికి వచ్చిన అతిథులను ఆదరించింది. ఏనాడూ ధైర్యాన్ని కోల్పోలేదు. అజ్ఞాత వాస సమయంలో కీచకుడు చెరపట్టాలని చూశాడు. సహించింది. ధైర్యంగా భీముడితో సంహరింపచేసింది. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది ద్రౌపది.
రామాయణంలో రాముడు మొదలుగా సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు... అందరూ పిరికితనాన్ని దరిచేరనివ్వలేదు. పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న తరుణంలో కైకేయి రాముడిని పిలిచి, ‘నువ్వు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లాలి’ అనగానే, ‘సంతోషం తల్లీ’ అంటూ నారవస్త్రాలు ధరించి అడవులకు వెళ్లిపోయాడు.
పట్టు పరుపుల మీద శయనించిన వాడు, అడవులలో నేల మీద పరున్నాడు. పంచభక్ష్యపరమాన్నాలు భుజించిన సీతారామలక్ష్మణులు... అడవులలో లభించే అతి సామాన్యమైన ఆహారాన్ని భుజించారు. ధైర్యం మాత్రం కోల్పోలేదు. అడవులలో ఎందరో రాక్షసులను సంహరించాడు.
లంకా నగరాధిపతిౖయెన రావణుడు సీతమ్మను అపహరించిన సమయంలో విలపిస్తున్న రాముడితో లక్ష్మణుడు, ‘అన్నయ్యా! పిరికితనం, దుఃఖం మనిషిలోని ఆలోచనను సంహరిస్తాయి. ఉత్సాహమే మనకు పరమౌషధం. మనసు ప్రశాంతంగా ఉంటే, మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం సీతమ్మ జాడను కనిపెట్టవచ్చు’ అంటూ ధైర్యం గురించి పలికాడు.
సీతమ్మను అన్వేషిస్తూ బయలుదేరిన హనుమంతుడు.. అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా అన్నిటినీ అధిగమించాడు. ఎట్టకేలకు లంకానగరంలో అశోకవనంలో శింశుపా వృక్షచ్ఛాయలో సీతమ్మను కనిపెట్టాడు. అతడి ధైర్యమే అతడిని కార్యసాధకుడిని చేసింది.
ధైర్యమే విజయానికి ఆయుధం. పిరికితనమే అపజయానికి కారణం... అన్న పెద్దల మాటలను అమృతతుల్యంగా భావించి, అనుసరించాలని చాణుక్యుడు చెబుతున్నాడు.
- డా. పురాణపండ వైజయంతి-
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
