హైదరాబాద్‌లో దీపావళి సందడి ముగిసినా మరో పండుగ జోష్ మొదలవుతుంది. దున్నపోతుల అందాలు... డప్పుల దరువులు... యువత కేరింతలు... అదే హైదరాబాద్ ప్రత్యేకతగా నిలిచిన సదర్ ఉత్సవ్!
ఒంటినిండా నూనె మర్దన... కొమ్ములకు రంగులు... మెడలో గంటలు... పూలమాలలతో రాజసం! డప్పుల దరువులు... యువత కేరింతలు... దున్నపోతుల దర్జా... ఇదీ తెలంగాణ సదర్ ఉత్సవ్ ప్రత్యేకత!
తరతరాలుగా యాదవులు ఆచరిస్తున్న ఈ సంప్రదాయం ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. దీపావళి దీపాల వెలుగుల తర్వాత హైదరాబాద్ వీధుల్లో సదర్ సంబరాలు మొదలవుతాయి. సాధారణంగా పశువులుగా కనిపించే దున్నపోతులు సదర్ వేళ ప్రత్యేక ఆకర్షణగా మారిపోతాయి. పశుసంపదపై ప్రేమాభిమానాలను చాటుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
దీపావళి తర్వాత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకను దున్నపోతుల పండుగ లేదా సదర్ సమ్మేళనంగా ఘనంగా నిర్వహిస్తారు.అలంకరించిన భారీ దున్నపోతులు, ఎద్దులతో ప్రదర్శనలు, శ్రీకృష్ణుడికి పూజలు, డప్పు చప్పుళ్లకు తగినట్టుగా సాంప్రదాయ యాదవ నృత్యాలు, స్టిక్ ప్రదర్శనలు ఉంటాయి.
నారాయణగూడ వైఎంసీఏ వద్ద జరిగే సంప్రదాయ వేడుక పెద్ద సదర్ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పశుసంపదకు గౌరవం... సంప్రదాయానికి ప్రతిరూపం... తరతరాల అనుబంధానికి నిలువుటద్దం! దున్నపోతుల పండుగగా మొదలై... యాదవుల ఆత్మగౌరవ వేడుకగా ఎదిగిన సదర్ ఉత్సవ్ భాగ్యనగర సంస్కృతిలో తనదైన ముద్ర వేస్తోంది!
