హైదరాబాద్: నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చొరబడిన దుండగులు 29 తులాల బంగారంతో పాటు రూ.1.5 లక్షల నగదును అపహరించుకొని పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బాధిత కుటుంబం దమ్మాయిగూడలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఇంటి నుంచి వెళ్లింది. కార్యక్రమం ముగించుకొని అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దొంగతనం నిన్న రాత్రి సమయంలో జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఇంట్లోకి దొంగలు ఎలా ప్రవేశించారు? చోరీకి పాల్పడిన వారు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
