ఊరంతా దీపాల వెలుగులు.. ఇళ్లల్లో దీపావళి పండుగ సందడి. కానీ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో మాత్రం దీపావళి వేడుకలు శ్మశానంలో జరుగుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే అక్కడి ప్రత్యేక సంప్రదాయం గురించి తెలుసుకుందాం. . !
శ్మశానవాటికలో సమాధులకు ముస్తాబు
దీపావళి పండుగకు ముందే శ్మశానవాటికలోని సమాధులను శుభ్రం చేసి, రంగులు వేసి ముస్తాబు చేస్తారు. దీపావళి రోజు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుంటారు. పూలు, దీపాలతో సమాధులను అలంకరిస్తారు. తమ ఆత్మీయులకు ఇష్టమైన వంటకాలను తీసుకొచ్చి సమర్పిస్తారు.
దీపాలు వెలిగిస్తూ, కుటుంబ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పండుగ జరుపుకుంటారు. కొన్ని కుటుంబాలు బాణసంచా కూడా కాలుస్తాయి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు సైతం ఈ సంప్రదాయంలో పాల్గొనేందుకు స్వస్థలానికి చేరుకుంటారు. తమకు జన్మనిచ్చి, పెంచి పెద్దచేసినవారిని మరచిపోకుండా పండుగ రోజున వారి సమాధుల వద్ద గడపడం తమకు ఎంతో ప్రత్యేకమని స్థానికులు చెప్తున్నారు.
కరీంనగర్ నగరంలోని కార్ఖానగడ్డ, కాశ్మీర్‌గడ్డ, ఆదర్శ్‌నగర్, సవరన్ స్ట్రీట్ పరిధిలోని హిందూ శ్మశాన వాటికల్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. పూర్వీకుల సమాధుల సాక్షిగా కొన్నేళ్లుగా సంబరాలు జరుపుకుంటున్నారు.
నైవేద్యాల సమర్పణ
దీపావళి రోజు సాయంత్రం కుటుంబ సమేతంగా కొత్త బట్టలు ధరించి ఇక్కడికి వస్తారు. తమ పెద్దలకు ఇష్టమైన రకరకాల వంటకాలు, పిండివంటలు , పండ్లను సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. కొన్ని కుటుంబాలలో చనిపోయిన వారు జీవితకాలంలో ఇష్టపడిన ప్రత్యేక వస్తువులను కూడా అక్కడ ఉంచి పూజిస్తారు.
ప్రతి సమాధిపై మట్టి ప్రమిదలతో దీపాలు, కొవ్వొత్తులను వెలిగిస్తారు. చీకటి పడిన తర్వాత పిల్లలు, పెద్దలు కలిసి సమాధుల మధ్యే టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ అర్ధరాత్రి వరకు ఆనందంగా గడుపుతారు. మొదట్లో ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికే పరిమితమైన ఈ ఆచారం, ఇప్పుడు మరికొన్ని వర్గాలకూ విస్తరించింది.
ALSO READ : Diwali special 2026: సాంకేతిక వెలుగుల్లో సంప్రదాయ దీపాలు..
ఏటా వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొంటుండటంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా శ్మశాన వాటికల వద్ద ప్రత్యేక లైటింగ్, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు చేశారు. చనిపోయిన వారు దేవుడి రూపంలో తమను ఆశీర్వదిస్తారని, తమ ఎదుగుదలకు కారణమైన పెద్దలను పండుగ రోజున గుర్తుచేసుకోవడమే అసలైన దీపావళి అని స్థానిక ప్రజలు నమ్ముతారు. బంధం అంటే బతికున్నంత వరకే కాదు... మరణించిన తర్వాత కూడా జ్ఞాపకాల రూపంలో కొనసాగుతుందని ఈ సంప్రదాయం చాటుతోంది.
దీపావళి అంటే కరీంనగర్లో మాత్రం ఓ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. ఇళ్లలోనే కాదు శ్మశానాల్లోనూ దీపాలు వెలుగుతాయి. సమాధులపై పూలు విరబూస్తాయి. పూర్వీకుల జ్ఞాపకాలు మనసులను తడుముతాయి.
