దీపావళి అంటేనే దీపాల వెలుగులు... టపాసుల మోతలు... ఆనందాల సందడి! కానీ ఆ ఆనందం పర్యావరణానికి, మన ఆరోగ్యానికి హాని కలిగించకూడదన్న ఆలోచన ఇప్పుడు ప్రజల్లో పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం.. భరించలేని శబ్ద కాలుష్యం నేపథ్యంలో సంప్రదాయ వేడుకలకు పర్యావరణ స్పృహను జోడిస్తున్నారు.
మట్టి ప్రమిదలు వెలిగిస్తూ.. రసాయన రంగులకు దూరంగా ఉంటూ తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యంతో దీపావళి జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా నగరవాసుల్లో పర్యావరణహిత దీపావళిపై అవగాహన పెరుగుతోంది.
పురాణ గాథ నుంచి నేటి స్మార్ట్ లైటింగ్, డిజిటల్ గ్రీటింగ్స్ వరకు దీపావళి వేడుకలు కాలానుగుణంగా కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి.హైదరాబాద్‌లో దీపావళి వేడుకల కోసం యాప్, వాయిస్ కంట్రోల్, ఆటోమేషన్ సదుపాయాలున్న స్మార్ట్ లైటింగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. సంప్రదాయ ప్రమిదలతోపాటు, మొబైల్ ఫోన్ ద్వారా రంగులు మార్చుకునే ఎల్ఈడీ స్ట్రిప్స్, స్మార్ట్ బల్బులు పండుగ శోభను మరింత పెంచుతున్నాయి.
దీపావళి ఇంటి అలంకరణ కోసం వివిధ రకాల లైటింగ్ ప్యాటర్న్స్ డిజిటల్‌గా కంట్రోల్ చేసుకునే సదుపాయం ఉంది.స్మార్ట్ బల్బులు, కనెక్టెడ్ ల్యాంప్స్, విప్రో, ఫిలిప్స్ వంటి బ్రాండ్ల స్మార్ట్ బల్బులను గూగుల్ అసిస్టెంట్ లేదా అలెక్సా వాయిస్ కమాండ్స్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు.
పూజగదికి వెచ్చని పసుపు రంగు, లివింగ్ రూమ్‌కు వైబ్రెంట్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఇంటికి లేదా అపార్ట్‌మెంట్‌కు సొంతంగా లైటింగ్ అమర్చడం కష్టమైతే, హైదరాబాద్‌లో హోమ్ డెకరేషన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ తోరణాలు, సింథటిక్ వస్తువులకు బదులుగా మామిడి ఆకులు, బంతిపూల దండలు, కాగితపు క్రాఫ్ట్స్‌తో ఇళ్లను అలంకరించుకోవడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా తగ్గుతాయి.
గ్రీన్ క్రాకర్స్
సాధారణ టపాసులను కాల్చడం వల్ల వచ్చే విపరీతమైన పొగ, రసాయన కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీన్ క్రాకర్స్ ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇవీ సాధారణ టపాసుల కంటే 30 నుంచి 35 శాతం తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఈ క్రాకర్స్ పై కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లోగో, క్యూఆర్ కోడ్ ఉంటాయి.
గ్రీన్ క్రాకర్స్ తక్కువ శబ్దంతో, సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు లేకుండా పేలుతాయి. తెలంగాణ ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం సాధారణ బాణసంచా కంటే గ్రీన్ క్రాకర్స్ వాడకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
మట్టి ప్రమిదలు
మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడటం వల్ల గాలి శుద్ధి అవుతుంది. స్థానిక కుమ్మరులు తయారుచేసే ప్రమిదలు కొనడం ద్వారా వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. శిల్పారామం, ఆర్గానిక్ సంతలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో స్థానిక కుమ్మరులు తయారుచేసిన మట్టి ప్రమిదలు ముమ్మరంగా అమ్ముడవుతున్నాయి.
ప్రకృతిసిద్ధ రంగులతో రంగోలి
ఇంటి ముందు వేసే ముగ్గులలో రసాయన రంగులను వాడటం వల్ల నేల కలుషితం అవుతుంది. దీనికి బదులుగా సహజ రంగులైన పసుపు, కుంకుమ, బియ్యం పిండి, కాఫీ పొడి, ఎండబెట్టిన రోజా, చామంతి, బంతి పూల రెక్కలను ఉపయోగించి వినూత్నమైన ముగ్గులు వేయొచ్చు.పండుగ మరుసటిరోజు ఈ పూలను మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగించొచ్చు.
నోరూరించే పిండివంటలు
దీపావళి పండుగ అంటేనే నోరు ఊరించే పిండివంటలు, రకరకాల మిఠాయిల సమాహారం. తెలంగాణలో కజ్జికాయలు, కాజాలు, అరిసెలు, బాదుషాలను పండుగ పిండివంటలుగా చేస్తుంటారు. మోతీచూర్, బూందీ లడ్డూలు లక్ష్మీ పూజ నైవేద్యానికి ఎంతో శ్రేష్ఠం. జీడిపప్పు, చక్కెరతో చేసే కాజు బర్ఫీ పండుగ రోజుల్లో బంధుమిత్రులకు బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ చాయిస్.
శుద్ధమైన నెయ్యితో నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా చేసే మైసూర్ పాక్ పండుగ టేబుల్‌పై ప్రత్యేకంగా నిలుస్తుంది. తీపి పదార్థాలతోపాటు సమతుల్యత కోసం తెలంగాణ ఇళ్లలో కారంగా ఉండే మురుకులు, చెక్కలు, కొబ్బరి గారెలు వంటి కరకరలాడే స్నాక్స్ కూడా తయారుచేస్తారు.
దివాలీ స్పెషల్ మెగా కార్నివాల్
హైదరాబాద్ నగరంలోని మై హోం త్రిదశలో దివాలీ స్పెషల్ మెగా కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్లో షాపింగ్, ఫుడ్, ఫన్ గేమ్స్, ఫెస్టివ్ గేమ్స్ తో నగరవాసులు మర్చిపోలేని మధుర అనుభూతులను సొంతం చేసుకున్నారు.
ఫ్రీ మెహందీతో యువతులు సందడి చేశారు. కూకట్ పల్లిలోని ఇండస్ ఒన్ సిటీలో నవంబర్1న దివాలీ స్పెషల్ కార్నివాల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్నివాల్లో ఫెస్టివ్ షాపింగ్, ఫన్, ఫ్యాషన్, సెలెబ్రేషన్స్‌తో సందడి చేశారు. అష్టలక్ష్మి దేవాలయంలో దీపావళి సందర్భంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తున్నారు.
ఏఐ శుభాకాంక్షలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మీ పేరు లేదా మీ బ్రాండ్ పేరుతో కూడిన 3డి అవతార్‌లు, చార్మినార్ లేదా హుస్సేన్ సాగర్ వంటి హైదరాబాద్ ల్యాండ్‌మార్క్‌ల నేపథ్యం, వెలిగే ప్రమిదలతో కూడిన అద్భుతమైన డిజిటల్ శుభాకాంక్షలను ఏఐ టూల్స్ ద్వారా క్షణాల్లో క్రియేట్ చేయొచ్చు.
టాప్ డిజిటల్ బహుమతులు
డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు, ఈ-వోచర్లు, షాపింగ్, జువెలరీ, ట్రావెల్ కేటగిరీల్లో ప్రముఖ బ్రాండ్ల డిజిటల్ వోచర్లను ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా క్షణాల్లో పంపొచ్చు. రోజువారీ జీవితంలో ఉపయోగపడే డిజిటల్ గాడ్జెట్లు కూడా దీపావళి బహుమతులుగా ట్రెండ్ అవుతున్నాయి.
వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంకులు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు, అలెక్సా స్మార్ట్ స్పీకర్లు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, పెద్ద బజార్లలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లు, ఆటోమేటిక్ స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నారు.
వ్యాపారులు లక్ష్మీ పూజ సమయంలో సాంప్రదాయ ఖాతా పుస్తకాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను పూజించి నూతన ఆర్థిక సంవత్సరానికి శ్రీకారం చుడతారు. దీపావళి పండుగ నాడు మన ఆనందం ప్రకృతికి భారంగా మారకూడదు.. భావితరాలకు కాలుష్యాన్ని వారసత్వంగా ఇవ్వకూడదు!
సీడ్ బాంబ్స్ బహుమతులు
దీపావళికి స్వీట్లు, ప్లాస్టిక్ వస్తువులను గిఫ్ట్‌లుగా ఇచ్చే బదులు ఇండోర్ ప్లాంట్లు, ఔషధ మొక్కలు లేదా సీడ్ బాంబ్స్ (విత్తన బంతులు) బహుమతిగా ఇవ్వడం ఒక కొత్త ట్రెండ్. బాణసంచా కాల్చి పర్యావరణానికి నష్టం చేసే బదులు, ఈ విత్తన బంతులను నాటడం ద్వారా భవిష్యత్తుకు పచ్చదనాన్ని కానుకగా ఇవ్వవచ్చునం టున్నారు హైదరాబాద్ పర్యావరణ శాస్త్రవేత్తలు.
దీపావళి సిటీ సెలబ్రేషన్స్
లాడ్ బజార్, బేగమ్ బజార్ ప్రాంతాలు దీపావళికి కావాల్సిన సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, మట్టి ప్రమిదలు, పూజ సామాగ్రి కొనుగోళ్లతో ఈ మార్కెట్లు కిటకిటలాడతున్నాయి. సిటీలోని శిల్పారామం, సండే సోల్ సాంట, పాప్‌స్టాప్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దీపావళి ఎగ్జిబిషన్లు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. హుస్సేన్ సాగర్ తీరం వెంట బాణసంచా వెలుగులు, చార్మినార్ పరిసర ప్రాంతాలు దీపాలతో మెరిసిపోతున్నాయి.
