దీపావళి పండుగ విశిష్టత.. పురాణ కథ ..నరకాసుర వధ..ఛఠ్ పూజల వివరాలు ఇవే..!

దీపావళి పండుగ విశిష్టత.. పురాణ కథ ..నరకాసుర వధ..ఛఠ్ పూజల వివరాలు ఇవే..!

శ్రీకృష్ణుడు, సత్యభామలు నరకాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా నరక చతుర్దశిని జరుపుకుంటారనే కథ దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని చేకూరుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన ఆధిపత్యానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది.

 దీపావళి వెనుక ఉన్న ముఖ్యమైన పురాణ కథల్లో నరకాసుర వధ ఒకటి. భూదేవి కుమారుడైన నరకాసురుడు లోకకంటకుడిగా మారి ప్రజలను, దేవతలను హింసిస్తుంటాడు. అతడి ఆగడాలను అరికట్టడానికి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్తాడు. ఈ యుద్ధంలో సత్యభామ కూడా ధైర్యం గా పోరాడుతుంది.

 ఒక ప్రాంతీయ కథనం ప్రకారం యుద్ధంలో కృష్ణుడు మూర్ఛిల్లినప్పుడు సత్యభామ స్వయంగా విల్లు పట్టి నరకాసురుడిని సంహ రిస్తుంది. భూదేవి అవతారమే సత్యభామ అని, తన తల్లి చేతిలోనే మరణం సంభవించాలనే వరం నరకాసురుడికి ఉండటంతో ఆమె చేతిలోనే అతడి అంతం జరిగిందని మరో కథనం చెబుతుంది. 

నరకాసురుడు మరణించే ముందు తన సంహారాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగగా జరుపుకోవాలని కోరుకున్నాడనేది కూడా ప్రాచుర్యంలో ఉన్న కథ. ఈ విజయానికి గుర్తుగా నరక చతుర్దశిని, ఆ మరుసటి రోజు దీపావళిని జరుపుకుంటారు.

దీపావళి తర్వాత..

ఉత్తరాది రాష్ట్రాల మహిళలు దీపావళి తర్వాత నవంబర్13 – 16 వరకు నాలుగు రోజులపాటు ఛఠ్‌‌ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌‌లోని బీహారీ, పూర్వాంచల్ సంఘాల సహకారంతో జీహెచ్‌‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన సరస్సులు, ఘాట్‌‌ల వద్ద ఈ పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ALSO READ : సమాధుల సాక్షిగా దీపావళి సంబరాలు..కరీంనగర్‌ కార్ఖానాగడ్డలో ప్రత్యేక సంప్రదాయం

ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్ బేబీ పాండ్ ప్రాంతం, సరూర్‌‌నగర్ చెరువు, ఫాక్స్ సాగర్, ఉప్పల్, కూకట్‌‌పల్లి, గచ్చిబౌలి, ఆర్కేపురం ప్రాంతాల్లోని స్థానిక చెరువుల వద్ద మహిళలు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు