ఒకప్పుడు ఆటలంటే క్రికెట్... ఫుట్‌బాల్... ఇప్పుడు ట్రెండ్ మారింది. కాళ్లకు స్కేటింగ్ షూస్ కట్టుకొని చక్రాలపై దూసుకెళుతున్నారు హైదరాబాద్ యువత. రోడ్లపై వేగం... స్కేటింగ్ రింక్లలో విన్యాసాలు... పోటీల్లో పతకాల వేట! పడినా లేస్తాం... జారినా సాగిపోతాం... అంటూ స్కేటింగ్‌తో సరికొత్త సందడి చేస్తున్నారు.
చిన్నారుల నుంచి యువత వరకు స్కేటింగ్‌పై ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో ఈ స్పోర్ట్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. వేగమే కాదు.. అదో ప్రత్యేకమైన ఫీల్! కాళ్లకు స్కేట్స్.. తలకు హెల్మెట్.. మోచేతులు, మోకాళ్లకు రక్షణ కవచాలు.. అంతా సిద్ధమైతే చాలు.. స్కేటర్స్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చినట్టే!
మొదట్లో ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా భయం.. బ్యాలెన్స్ తప్పితే కిందపడే ప్రమాదం. కానీ క్రమంగా పట్టు సాధిస్తే మాత్రం స్కేటింగ్ ఇచ్చే థ్రిల్ వేరే లెవల్. వేగంగా ముందుకు దూసుకెళ్లడం.. మలుపుల్లో చాకచక్యంగా తిరగడం.. అడ్డంకులను దాటడం.. శరీరాన్ని నియంత్రిస్తూ విన్యాసాలు చేయడం.. ఇలా ఒక్కో స్కేటర్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే చూసేవారికి కూడా ఉత్సాహం కలుగుతుంది.
ఫిట్ నెస్, వినోదం, నైపుణ్యం
హైదరాబాద్ నగరం నలుమూలలా స్కేటింగ్ శిక్షణా కేంద్రాలు వెలిశాయి. రోలర్ స్కేటింగ్ అంటే మీకు ఇష్టమా? మా ఉత్సాహభరితమైన కమ్యూనిటీలో చేరి, ఫిట్నెస్, వినోదం, నైపుణ్య నిర్మాణంలోకి దూసుకెళ్లండి. కొత్తగా నేర్చుకునేవారి నుంచి నిపుణుల వరకు, మేము అన్ని స్థాయిల వారికి నిపుణులైన కోచింగ్‌ను అందిస్తాం... రండి, కలిసి స్కేట్ చేద్దాం! అంటూ కోచ్‌లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వనస్థలిపురంలోని భూలక్ష్మి నగర్ కేంద్రంగా హైదరాబాద్ స్కేటర్స్ క్లబ్ ఏర్పాటైంది. ప్రతి జారుడు కదలిక బలానికి, సంకల్పానికి, ఇతరులను ప్రేరేపించే శక్తికి నిదర్శనం.
ఎన్నో స్కేటింగ్ శిక్షణా కేంద్రాలు
స్కేటింగ్ క్రమశిక్షణను, కదలికలోని ఆనందాన్ని మిళితం చేసే ఒక వ్యాయామం.స్కేట్ చేయండి, సాగతీయండి... ప్రతిరోజూ మరింత బలంగా ఎదగండి! అంటారు కోచ్‌లు. స్కేటింగ్ ఒక నైపుణ్యం కాదు...ఇది బలం, ఏకాగ్రత, స్వేచ్ఛతో కూడిన ప్రయాణం. స్కేటింగ్ చేస్తూ ఉండండి, ఎదుగుతూ ఉండండి! అంటుంటారు క్రీడాకారులు.
హైదరాబాద్ నగరంలో స్కేటింగ్ క్రేజ్ ఏర్పడటంతో పలు స్కేటింగ్ అకాడమీలు, శిక్షణ కేంద్రాలు వెలిశాయి. నగరంలోని ట్యాంక్ బండ్ రోడ్డు ప్రతీ ఆదివారం ఉదయం ఏడుగంటలకు స్కేటర్లతో సందడిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా ఉచితంగానే స్కేటింగ్ చేయవచ్చు. హైదరాబాద్ స్కేటర్స్ ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఆదివారం నిర్వహిస్తోంది.
కవాడిగూడలో ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ బ్యాంక్ ట్రాక్ పిల్లల స్కేటింగ్ కోసం అనుకూలమైన రింక్ ఏర్పాటైంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో బాషా రోలర్ స్కేటింగ్ అకాడమీలో పిల్లలకు ప్రొఫెషనల్ స్థాయి స్కేటింగ్ శిక్షణ ఇస్తున్నారు. మాదాపూర్ చెస్ స్కేటింగ్ క్లబ్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్స్ శిక్షణ అందుబాటులో ఉంది.
ఉస్మానియా స్కేటింగ్ రింక్ వీకెండ్స్‌లో పిల్లలతో సందడిగా ఉంటుంది. శంషాబాద్‌లోని రోలర్ స్కేటింగ్ రింక్, ఇందిరానగర్, జీహెచ్ఎంసీ ప్లే పార్క్ స్కేటింగ్, ఆరాంఘర్‌లలో స్కేటర్స్ సందడి కనిపిస్తుంది. మణికొండ స్పీడ్ స్కేటింగ్ టీమ్ క్లబ్, బీహెచ్ఈఎల్ రోలర్ స్కేటింగ్ ట్రాక్ స్కేటర్లతో కళకళలాడుతుంది.
భద్రతే ఫస్ట్.. వేగం నెక్స్ట్
స్కేటింగ్‌లో వేగం ఎంత ముఖ్యమో.. భద్రత కూడా అంతే ముఖ్యం. హెల్మెట్, మోకాళ్లు, మోచేతులు, మణికట్టుకు రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించాలి. శిక్షకుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే సాధన చేయాలి.
సాధారణ రహదారులపై ట్రాఫిక్ మధ్య స్కేటింగ్ చేయడం ప్రమాదకరం అంటారు కోచ్ శ్రీరాం. చక్రాలు చిన్నవే.. కానీ వాళ్ల కలలు మాత్రం పెద్దవి! పడిపోతే ఓటమి అనుకోరు.. మళ్లీ లేస్తారు. వేగం తగ్గితే వెనక్కి తగ్గరు.. సాధనతో ముందుకు సాగుతారు. స్కేట్స్‌పై సాగే ప్రతి అడుగులోనూ ఓ లక్ష్యం.. ప్రతి మలుపులోనూ ఓ సవాల్.. ప్రతి విజయానికీ ఓ కథ!
ఫిట్నెస్ నుంచి ఫన్ వరకు!
స్కేటింగ్ అంటే కేవలం సరదా మాత్రమే కాదు. శరీర సమతుల్యత, కాళ్ల కండరాల బలం, సమన్వయం, ఏకాగ్రత పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నిరంతర సాధనతో వేగాన్ని నియంత్రించడం, పడిపోకుండా జాగ్రత్తపడటం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం నేర్చుకోవచ్చు. అందుకే పిల్లలకు చిన్న వయసు నుంచే స్కేటింగ్ నేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న క్రేజ్!
హైదరాబాద్ నగరంలోని స్కేటింగ్ అకాడమీలు, శిక్షణా కేంద్రాల్లో పిల్లలు, యువత సాధన చేస్తున్నారు. కొందరు యువతీ, యువకులు హాబీగా నేర్చుకుంటుంటే... మరికొందరు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రోలర్ స్కేటింగ్, ఇన్లైన్ స్కేటింగ్, స్కేట్బోర్డింగ్ వంటి విభిన్న విభాగాలు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
అయితే ప్రతి విభాగానికి అవసరమైన పరికరాలు, శిక్షణా పద్ధతులు వేర్వేరుగా ఉన్నాయి. 2021లో స్కేటింగ్ క్రీడను ఒలింపిక్స్ సంఘం గుర్తించడంతో పాటు పోటీలు నిర్వహిస్తుండటంతో ఈ క్రీడపై క్రేజ్ పెరిగిందంటారు హైదరాబాద్ నగరానికి చెందిన స్కేటింగ్ కోచ్ హంజా. బండ్లగూడ పీరంచెరువు స్నేహిత్ హిల్స్ లో రోలర్ స్కేటింగ్ పేరిట స్కేట్ పార్క్ సంస్థను ఏర్పాటు చేసి యువతకు స్కేటింగ్ లో హంజా శిక్షణ ఇస్తున్నారు.
నాలుగేళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు గల వారు స్కేటింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారని కోచ్ హంజా చెప్పారు. తన వద్ద స్కేటింగ్ శిక్షణ పొందిన పిల్లలు రాష్ట్ర, జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో పతకాలు సాధించారని ఆయన తెలిపారు.
గతంలో కంటే యువత స్కేటింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని బౌరంపేటలో శ్రీరాం రోలర్ స్కేటింగ్ క్లబ్ ను ఏర్పాటు చేసి కోచ్ శ్రీరాం పిల్లలకు స్కేటింగ్ నేర్పుతున్నారు. క్రీడల్లో ఖరీదైనదిగా పేరొందినా ఎక్కువ మంది పిల్లలు స్కేటింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారని కోచ్ శ్రీరాం చెప్పారు.
జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్ విభాగాల్లో స్కేటింగ్ శిక్షణ ఇస్తున్నానని చెప్పారు. స్కేటింగ్ క్రీడ కోసం స్కేట్స్, హెల్మెట్, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, హ్యాండ్ గ్లౌజెస్, స్టెచ్ బుల్ స్కేటింగ్ డ్రెస్ కొనడం వ్యయంతో కూడుకోవడం వల్ల ధనవంతుల పిల్లలు ఎక్కువ మంది ఈ క్రీడను నేర్చుకుంటున్నారని శ్రీరాం చెప్పారు. ఎస్ఆర్ నగర్ లో కోచ్ జితేంద్ర పిల్లలకు స్కేటింగ్ పాఠాలు చెబుతున్నారు. చిన్నారులు స్కేటింగ్ పై మక్కువ చూపిస్తున్నారని జితేంద్ర చెప్పారు.
