‘మీ పేరు జాబితాలో లేదు’ అనేది పోలింగ్ బూత్‌లో వినిపించే ప్రభుత్వ సీన్ మెసేజ్ లాంటిది. పౌరుడి హక్కు కనిపించింది, సమాధానం మాత్రం లేదు. కాబట్టి ప్రశ్నలు సింపుల్. పేరు ఎందుకు పోయింది? ఎప్పుడు తొలగించారు? ముందుగా సమాచారం ఇచ్చారా? తిరిగి చేర్చుకునే మార్గం ఉందా? నాపేరు ఎక్కడ ఉంది? ఇదే ఓటరు అడుగుతున్నాడు. రేపు రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ సభ జరగనుంది. ఆ వేదికపై వినిపించే నినాదాల కంటే పెద్దది, దేశమంతా ప్రతిధ్వనించాల్సిన ప్రశ్న ‘నా పేరు ఓటరు జాబితాలో ఉందా?’ ఇది ఏ పార్టీకి చెందిన లాజిక్ కాదు. కామన్‌సెన్స్ యార్!
2000లో సెర్బియాలో ఎన్నికల ఫలితాలపై వివాదం వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన లెక్క ఒకలా ఉంటే, స్వతంత్ర పరిశీలకుల లెక్కలో విపక్ష అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. 18 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భారీ నిరసనల తర్వాత అధ్యక్షుడు మిలోషెవిచ్ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. అక్కడి ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే..‘ఈ లెక్క మాకు నమ్మకం కలిగించడం లేదు’ అని ప్రజలు అన్నారు. ప్రతిపక్షం ఒక్కటైంది. ఆందోళనను అణచేస్తే ప్రశ్న మాయమవుతుందని పాలకులు అనుకున్నారేమో.. కానీ ఆ ప్రశ్న మరింత పెద్దదై తిరిగొచ్చింది!
జార్జియాలో..
2003లో జార్జియాలో ఎన్నికల సమయంలో ఓటరు జాబితాల్లో తప్పులు, ఓట్ల లెక్కింపులో అక్రమాలపై పరిశీలకులు అభ్యంతరాలు తెలిపారు. ప్రతిపక్షాలు ఫలితాలను అంగీకరించలేదు. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ‘గులాబీ విప్లవం’ తర్వాత అధ్యక్షుడు షెవర్డ్ నాడ్జే రాజీనామా చేశారు. న్యాయస్థానం ఎన్నికల ఫలితాల్లో కొంతభాగాన్ని రద్దు చేసింది. మళ్లీ ఎన్నికలు జరిగాయి. అది దేశ రాజకీయాలనే మార్చింది. పౌరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మ్యూట్ పెట్టేస్తే, వాళ్లు వాల్యూమ్ పెంచడం మొదలుపెడతారు.
ఉక్రెయిన్‌లో..
ఉక్రెయిన్‌లో 2004 ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వచ్చాయి. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపారు. న్యాయస్థానం వివాదాస్పద రెండో విడత ఎన్నికను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. తిరిగి జరిగిన ఎన్నికలో ఫలితం మారింది. అక్కడి పాఠం.. సిస్టమ్ తప్పు చేయొచ్చు, కానీ తప్పును సరిచేసే ధైర్యం సిస్టమ్‌కి ఉండాలి. ‘చిల్ బ్రో, మమ్మల్ని నమ్మండి’ అనడం సరిపోదు. లెక్క చూపాలి. ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఆ దేశాల పరిస్థితులు భారతదేశంలో ఒకేలా లేవు. అక్కడి ఎన్నికల వివాదాలనూ, ఇక్కడి ఓటరు జాబితా సవరణలనూ ఒకటిగా చూడలేం. ప్రతి పేరు తొలగింపూ ఉద్దేశపూర్వకమని కూడా అనలేం. కానీ హెచ్చరిక మాత్రం సేమ్ టు సేమ్! ప్రజలు నమ్మకం కోల్పోతే, ఎన్నికల ఫలితంపైనా నమ్మకం పోతుంది.
బాధ్యతంతా పౌరుడిదేనా?
అధికారాన్ని ఎవరు, ఏ హక్కుతో ఉపయోగిస్తున్నారనేదే ప్రశ్న. ఈరోజు కూడా ప్రశ్నకు సమాధానం రాకపోతే ప్రజల ‘రిప్లై’ ఉంటుంది. ‘ధర్మో రక్షతి రక్షితః’ అని మనం అంటాం. ఓటు హక్కును కాపాడటం అంటే మనకు నచ్చిన పార్టీని కాపాడటం కాదు. మనకు నచ్చని పార్టీకి ఓటు వేసే పౌరుడి హక్కును కూడా కాపాడటమే. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఓటరు జాబితాలను ప్రత్యేకంగా సవరించే అధికారం ఉందని అంగీ కరించింది. కానీ ‘అధికారం ఉంది’ అంటే ‘ప్రతి నిర్ణయానికీ ఆటోమేటిక్ వెరిఫైడ్ టిక్’ కాదు. పేరు ఎందుకు తొలగించారు? ముందుగా సమాచారం ఇచ్చారా? పొరపాటు అయితే ఎక్కడికి వెళ్లాలి?
ప్రజలకు అర్థమయ్యే సమాధానం కావాలి.
పరిష్కారాలు పెద్ద రాకెట్ సైన్స్ కాదు. పేరు తొలగించే ముందు వ్యక్తికి సమాచారం ఇవ్వాలి. కారణాన్ని బహిరంగంగా చెప్పాలి. ఆన్‌లైన్ సౌకర్యం లేనివారికి స్థానిక సహాయం ఉండాలి. అన్ని పార్టీల పోలింగ్ ప్రతినిధులకు తనిఖీ అవకాశం ఇవ్వాలి. అప్పీల్ త్వరగా పరిష్కరించాలి. తిరిగి చేర్చిన పేర్ల వివరాలూ ప్రకటించాలి.
మరణించినవారి పేర్లు తొలగించాలి. రెండుచోట్ల నమోదైన పేర్లను సరిచేయాలి. అది జాబితా సవరణే. కానీ బతికున్న అర్హుడైన పౌరుడి పేరు పొరపాటునపోతే, అతనే ‘నేను ఉన్నాను’ అని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాలా? బాధ్యతంతా పౌరుడిదేనా, క్రెడిట్ మాత్రం సిస్టమ్‌దా! రామ్‌లీలా మైదానంలో వినిపించాల్సిన మాట ఒక్కటే. పేరు జాబితాలో లేకపోతే, అది ఒక వరుసలో మిస్సైన అక్షరం కాదు. ప్రజాస్వామ్యం నుంచి ఒక పౌరుడు లాగ్ ఔట్ అయిన క్షణం. ప్రజలు నేడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థ రిప్లై ఇవ్వాలి.. స్లోగన్‌తో కాదు, స్పష్టమైన లెక్కతో. పిక్చర్ అభీ బాకీహై దోస్తో!
- వెలిచాల రాజేందర్ రావు,
సీనియర్ నాయకుడు, కరీంనగర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
