ప్రజాస్వామ్యం కేవలం రాజ్యాంగంపై ఆధారపడి మాత్రమే బతకదు. రాజ్యాంగబద్ధంగా ఉనికిలోకి వచ్చిన సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తేనే తప్ప, లేకపోతే రాజ్యాంగం పనిచేయడం ఆగిపోతుంది. అందులో ప్రధానమైన సంస్థలు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడీషియరీ, ఎలక్షన్ కమిషన్, సివిల్ సర్వీస్ సంస్థలు. వీటిని విలువలతో నడపడానికి బలమైనవి నీతిమంతమైన, నిష్పక్షపాతమైన స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు.
1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటినుంచి 2014 వరకు వ్యవస్థల పనితీరు కొంత నిష్పక్షపాతంగా ఉండేది. ఎమర్జెన్సీలో (1975–77 వరకు) మాత్రం కొంత లెఫ్ట్ లీనింగ్ కమిట్‌మెంట్ వైపు వ్యవస్థలను నెట్టాలని ఆనాడు ఇందిరాగాంధీ, ఆమె సలహాదారులుగా ఉన్న అగ్రకుల లెఫ్ట్ మేధావులు ప్రయత్నం చేశారు. అప్పుడే కమిటెడ్ జ్యుడీషియరీ అనే నినాదం ముందుకువచ్చింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా జ్యుడీషియరీని తన సిద్ధాంతానికి మలుచుకోవాలని ఆనాడు ఆమె నినాదం కూడా ఇచ్చింది.
ఆనాడు దేశం ముందు ఇయ్యాల ఉన్న కులం చర్చలేదు. అగ్రకుల లెఫ్ట్ మేధావులు, లిబరల్స్ యూనివర్సిటీల్లో, కోర్టుల్లో, సివిల్ సర్వీస్‌లో, ఎలక్షన్ కమిషన్‌తో సహా ఆమె సిద్ధాంతానికి కొంత అనుకూలంగా మారారు. మండల్ కమిషన్ అనే పేరు కూడా ఆనాడు లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లు మాత్రం ఉన్నాయి. వాటిని ఈ మేధావులే ఎక్కడా అమలు చేసేవారు కూడా కాదు. బెంగాల్‌లాంటి చోట అసలు కులమే లేదని వ్యవస్థ నడిపారు. ఆ రోజుల్లో పెద్దగా చదువుకున్న ఎస్సీ, ఎస్టీలు కూడా లేరు. విద్యా వ్యవస్థ అప్పుడప్పుడే గ్రామస్థాయికి విస్తరిస్తున్నది. ఓబీసీలలో చదువు కాంక్ష కంటే వ్యవసాయం, కులవృత్తి చుట్టే చైతన్యం ముడిపడి ఉంది.
అయితే ఒక్క సివిల్ సర్వీస్ ద్వారా నడిచే సంస్థ ఆనాటి ఎన్నికల కమిషన్‌కు ఏకైక అధికారిగా ఉన్న టి.స్వామినాథన్ ధైర్యంగా, స్వతంత్రంగా ఎన్నికలు కండక్ట్ చేసినందువల్ల జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ మార్పు అతి ముఖ్యమైన మార్పుకు మూలమైన మండల్ కమిషన్ ఏర్పాటు జరిగింది. బీపీ మండల్‌ను దానికి చైర్మన్‌గా నియమించడం ఒక కీలక ఘట్టం. అది కూడా ఆనాడు జనతా పార్టీలో ఉన్న ఓబీసీ నాయకులైన ములాయంసింగ్, లాలుప్రసాద్‌ల వంటివారి ఒత్తిడితో బీపీ మండల్ పేరు ప్రతిపాదన జరిగింది.
లేకపోతే ఆ కమిషన్‌కు కూడా కాకా కలేల్కర్ లాంటి ఒక బ్రాహ్మణ మేధావిని చైర్మన్‌గా నియమించి ఉంటే ఏ మార్పు సాధ్యంకాని ఒక రిపోర్టు బయటికొచ్చేది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నుంచి ఎదిగి వచ్చిన నరేంద్ర మోదీ కూడా దేశ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ఆయన బీసీ పేరుతో అధికారంలోకి వచ్చి మొత్తం వ్యవస్థను, ముఖ్యంగా సివిల్ సర్వీస్‌ను, జ్యుడీషియరీని ఆర్‌ఎస్‌ఎస్‌కు కమిటెడ్ నిర్మాణాలుగా మారుస్తున్నారు. అందుకు మోహన్ భగవత్, అమిత్ షా, ఆదానీ, అంబానీలు పూర్తిగా ఏకీభావంతో ఉన్నారు.
ముస్లిం వ్యతిరేకత ఒక ఆయుధం
ఆర్ఎస్ఎస్, బీజేపీల ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేక హిందూత్వ జాతీయవాదం వారి సిద్ధాంతం కనుక దానికి కమిటెడ్‌గా పనిచేసేటట్టు గత 12 సంవత్సరాల్లో మలుచుకుంటూ వచ్చారు. వీరు నడిపే వ్యవస్థకు ఎమర్జెన్సీలో కాంగ్రెస్‌కు లేనటువంటి బలం ఏమిటంటే ఇప్పడు ఇది మూడు ఇంజిన్‌ల బండి. ఒకటి ఆర్ఎస్ఎస్, రెండు బీజేపీ, మూడు ఆదానీ, అంబానీల కేంద్రీకృత బలమైన పెట్టుబడి.
ఈ పెట్టుబడి మొత్తం వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు అనుకూలంగా పనిచేసేటట్టు మార్చగలదు. ఈ బలమైన మూడు ఇంజిన్‌ల వ్యవస్థ జన్ జీల ఉద్యమాలకుగానీ, ఇండియా కూటమి ఉద్యమాలకుగానీ భయపడేటట్టు కనిపించడం లేదు. దీని సుదీర్ఘ ప్రయత్నం మొత్తం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వర్గాలను పురాతన కాలానికి నెట్టడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు పెద్ద దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది.
ప్రొటెస్టులతో రాజ్యవ్యవస్థ మారదు
ఒక సిద్ధాంతపర రాజకీయ పార్టీ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి క్రమంగా రష్యాలోని పుతిన్ కమ్యూనిస్ట్ పార్టీలాగా నిరంతరంగా నామమాత్రపు ఎన్నికలు జరిపి నిరంతరం ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలనుకోవడం వల్ల వ్యవస్థ పూర్తిగా తలకిందులుగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ గ్రౌండ్ లెవల్‌లో విస్తరణస్థాయిలో మతపరంగా ప్రజాసమీకరణ చేస్తున్నప్పుడు, బలమైన పెట్టుబడిదారులు వారికి అండగా అన్నిరకాల వనరులు కలిపిస్తున్నప్పుడు ఎన్నికల రంగాన్ని న్యాయబద్ధంగా నడపడం అసాధ్యం. గత కొంతకాలంగా ఇజ్రాయెల్‌లో కూడా నెతన్యాహూ చాలా ఎన్నికలు గెలుస్తూ వస్తున్నాడు.
ఈసారి ఆయన గాజాపై జరిపిన అమానుష దాడిరీత్యా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేక తిరుగుబాటు రావడం వల్ల హంగ్ పార్లమెంట్ వచ్చింది. అయినాసరే ఏం చేసైనా ఆయనే అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇండియా పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ హిందూత్వ జాతీయవాద మూడు రంగాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బడా పెట్టుబడిదారులు ఐక్యంగా పనిచేస్తున్నందువల్ల అధికారులు వారితో ఉండకుండా స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఉండదు. అటువంటి అధికారులను, వారి కుటుంబాలను ఇబ్బందిపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. 2014కు ముందు కాంగ్రెస్, ఇతర పార్టీలు అలయన్స్‌లో అధికారంలో ఉన్నా ఆర్ఎస్‌ఎస్, బీజేపీలాగా బలమైన పెట్టుబడిదారులు ఏకమైనట్టు దానికి బలమైన పట్టు ఏనాడూ లేదు.
నెహ్రూకు కూడా పార్టీలో వ్యతిరేకత ఉండేది
నెహ్రూ మొదట ప్రధానిగా 17 ఏండ్లు పైగా ప్రధానమంత్రిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేక శక్తులు ఉండేవి. కానీ గత 12 సంవత్సరాలుగా మోదీకి, అమిత్ షాకి వ్యతిరేక శక్తులు బీజేపీలో కనపడటం లేదు. ఎందుకు? ఆర్ఎస్‌ఎస్, అంబానీ, అదానీ వారికి పూర్తి మద్దతునిస్తూ వ్యవస్థ అన్ని స్థాయిల్లో బహుళ ఆలోచనలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈపాటికి ఆ ప్రక్రియ దాదాపు దగ్గరకొస్తున్నట్టు కనిపిస్తున్నది. నెహ్రూ కాలంలో సర్దార్ పటేల్, వైబీ చవాన్, కామరాజ్ నాడర్ వంటి నెహ్రూతో అంగీకరించనివారితో వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కేబినెట్‌లో చాలాకాలం ఉన్నారు.
నెహ్రూ మొదటి కేబినెట్‌లో అంబేద్కర్, శ్యామాప్రసాద్ ముఖర్జీతో కృష్ణమీనన్ వంటి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఉన్నందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రథమస్థాయిలో నిలదొక్కుకున్నది. దాన్ని 2014 నుంచి పూర్తిగా విరుద్ధ ధోరణిలో నడపడం జరుగుతోంది.ఆర్ఎస్ఎస్, బీజేపీలలో వారికి అండగా ఉన్న పెట్టుబడిదారులలో పూర్తి సిద్ధాంత ఐక్యత ఉన్నది. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు అన్ని స్థాయిలలో ఆ సిద్ధాంతానికి అనుకూల శక్తుల క్షేత్రాలుగా మలచాలనే తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. అది ఇప్పటికే వ్యవస్థల్లోకి లోతుగా నడుస్తున్నది. ఇంకొక పది సంవత్సరాలు ఈ వ్యవస్థ ఇలానే కొనసాగితే ప్రజాస్వామ్యం పూర్తిగా మారిపోతుంది.
రాజ్యాంగం నామమాత్రం
క్రమక్రమంగా రాజ్యాంగం ఒక నామమాత్రపు డాక్యుమెంట్‌గా మారుతుంది. అది ఉనికిలోఉన్నట్టే ఉంటుంది. కానీ దాని అమలు పూర్తిగా దాని స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది. దాని ఆచరణ ప్రక్రియ క్రమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్పత్తి కులాలకు వ్యతిరేక శక్తులే నిండుకుని ఉన్నాయి. అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి వ్యవస్థ ఏమవుతుందో చూసుకుంటూ ఉండాల్సిందేనా?
కమిటెడ్ సీఈసీ
మోదీ ప్రభుత్వం సీఈసీని తన సిద్ధాంతాలకు కమిటెడ్ సంస్థగా మలుచుకుంటోంది. దాదాపు ఆ ప్రయత్నంలో జయప్రదమైనట్టు కనపడుతుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఈ విధమైన కొత్త కమిటెడ్ రాజ్యసంస్థలతో రాజ్యాంగాన్ని మార్చకుండానే ప్రపంచంలోనే కొత్త తరహా నియంతృత్వానికి దారితీసే ప్రమాదమున్నది. ఈసీ అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధంగా మారాక మిగతా సంస్థలు అరకొర న్యూట్రాలిటీని మెయిన్‌టెయిన్ చేసినా వ్యవస్థ, ప్రతిపక్ష పార్టీలు బతకలేవు. దేశంలో అటువంటి స్థితి దాదాపుగా దగ్గరకొస్తున్నట్టు కనిపిస్తున్నది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
