- అంబేద్కర్ లా కాలేజీలో ముగిసిన రెండో జాతీయ న్యాయోత్సవం
ముషీరాబాద్, వెలుగు: లా స్టూడెంట్స్కష్టపడి చదివి, న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి సూచించారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు చెందిన అంబేద్కర్ లా కాలేజీ ఆధ్వర్యంలో విద్వత–2026 పేరుతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండో జాతీయ న్యాయోత్సవం శనివారం ముగిసింది. ముగింపు వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి, తెలంగాణ హైకోర్టు రిటైర్డ్జడ్జి జస్టిస్ డి.నాగార్జున, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వర్లు, అంబేద్కర్విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ విద్యాసంస్థకు చెందిన 16 మంది విద్యార్థులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికవడం అభినందనీయమని, ఇండియా టుడే 2025 సర్వేలో వాల్యూ ఫర్ మనీ విభాగంలో కళాశాల దేశంలో నాలుగో స్థానం సాధించడం గర్వకారణమన్నారు. అనంతరం నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, అధికారాల విభజన, స్వేచ్ఛాయుత ఎన్నికలు, న్యాయవ్యవస్థ ప్రాధాన్యత వంటి అంశాలను వివరించారు. ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ జి.వినోద్ మాట్లాడుతూ.. విద్యార్థులు రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పెంచుకోవాలని సూచించారు. సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ యాదగిరి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సృజన తదితరులు పాల్గొన్నారు.
