యూపీలో 350 సీట్లు టార్గెట్.మూడోసారి అధికారమే బీజేపీ లక్ష్యం

యూపీలో 350 సీట్లు టార్గెట్.మూడోసారి అధికారమే బీజేపీ లక్ష్యం
  • లక్నోలో పార్టీ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా
  • 2017 ఫలితాలు 2027లోనూ రిపీట్ కావాలె
  • టికెట్ ఎవరికొచ్చినా బీజేపీనే గెలిపించాలె
  • 337 సీట్లు పక్కా: డిప్యూటీ సీఎం పాఠక్

 

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 350 సీట్లు గెలవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శనివారం లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో యూపీ సీఎం యోగి, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ పాల్గొన్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్య రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2017 ఎన్నికల ఫలితాలను 2027లోనూ పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు.

విభేదాలను పక్కనపెట్టి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కమలాన్ని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ సంస్థాగత నేతల మధ్య సమన్వయం ఉండాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. బ్రజేశ్ పాఠక్ మాట్లాడుతూ 2017 నుంచి ప్రధాని మోదీ, సీఎం యోగి నాయకత్వంలో యూపీలో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. శాంతిభద్రతలు, మౌలిక వసతులు, పరిశ్రమల పెట్టుబడులు, వైద్య రంగంలో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. మెడికల్ కాలేజీలు, ఎక్స్‌‌ప్రెస్‌‌వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులు విస్తరిస్తున్నాయని వివరించారు. 2027 ఎన్నికల్లో బీజేపీ 337 సీట్లు గెలిచి వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.