యూపీ ఓటరు లిస్ట్లో 1.27 కోట్ల మంది.. హిందువుల పేర్లు గల్లంతు: సీఎం యోగి ఆదిత్యనాథ్

యూపీ ఓటరు లిస్ట్లో 1.27 కోట్ల మంది.. హిందువుల పేర్లు గల్లంతు: సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: ఉత్తరప్రదేశ్ ఓటరు జాబితా నుంచి 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. శనివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఉత్తరప్రదేశ్‌‌లో ప్రస్తుతం సుమారు 13 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, అయితే.. రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం వాస్తవానికి 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండాలని ఆయన తెలిపారు. 

ఈ తొలగింపుల వల్ల 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో పార్టీ స్థానం బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఓటరు జాబితాలో పేర్లున్న 66 లక్షల మంది, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 55 లక్షల మంది, 18-–19 సంవత్సరాల వయస్సు గల 4.5 లక్షల మంది యువకులు అసెంబ్లీ ఓటరు జాబితాలో లేరని చెప్పారు. అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎం ఆదేశించారు.