- సోనియాకు కాకా వెంకటస్వామి ప్రస్థానాన్ని వివరించిన ఎంపీ వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి చేసిన పోరాటాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివరించారు. శనివారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. కాకా రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సాగించిన పోరాటాన్ని తెలియజేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో కలిసి పనిచేసిన కాకా.. కాంగ్రెస్ బలోపేతానికి తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
కాకా నివాసమే పార్టీ కార్యాలయంగా మార్పు
ఢిల్లీలోని చారిత్రాత్మక 24 అక్బర్ రోడ్ భవనం ఒకప్పుడు కాకా అధికారిక నివాసమని వంశీకృష్ణ గుర్తుచేశారు. ఆ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల కోసం అందుబాటులోకి తీసుకురావడంలో కాకా కీలక పాత్ర పోషించారని సోనియాకు చెప్పారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, త్యాగం, అంకితభావానికి ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ను రాజకీయ వేదికగా కాకుండా పేదల హక్కుల కోసం, పోరాడే వేదికగా కాకా భావించారని వంశీకృష్ణ పేర్కొన్నారు
