అండాల దందాలో 10 మంది అరెస్ట్...హైదరాబాద్ లో 49 మంది యువతులను రక్షించిన పోలీసులు

 అండాల దందాలో  10 మంది అరెస్ట్...హైదరాబాద్ లో 49 మంది యువతులను రక్షించిన పోలీసులు
  • వివరాలు వెల్లడించిన మల్కాజ్​గిరి సీపీ​ సుమతి

పద్మారావునగర్/దిల్ సుఖ్ నగర్, వెలుగు:  హైదరాబాద్ నగరంలో పేదరికమే పెట్టుబడిగా సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర అండాల (ఊసైట్ డొనేషన్) అక్రమ రవాణా ముఠా గుట్టును మల్కాజ్​గిరి కమిషనరేట్ పోలీసులు రట్టు చేశారు. ప్రముఖ ఐవీఎఫ్, సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులో అమాయక యువతులను మోసగిస్తున్న ఈ సంచలన రాకెట్ వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి శనివారం సికింద్రాబాద్​లోని తన క్యాంప్​ఆఫీస్​లో మీడియాకు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అమిత్ శర్మ, కోల్‌‌‌‌‌‌‌‌కతాకు చెందిన నిక్కత్ పర్వీన్, హైదరాబాద్​లోని నాంపల్లికి చెందిన దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌లతో కూడిన ఈ అంతర్రాష్ట్ర ముఠా.. బేగంపేట ప్రకాశ్​నగర్​లో నెలకు రూ.50 వేల భారీ అద్దె చెల్లిస్తూ ఒక భవనాన్ని అడ్డాగా మార్చుకుంది. 

దుర్గాప్రసాద్​సరూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని వెంకటేశ్వర కాలనీ రోడ్డు నంబర్ 14లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఈ ముఠా వివిధ రాష్ట్రాల నుంచి నిస్సహాయ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుంది. అండాలు దానం చేస్తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తామని ఆశచూపి నగరానికి రప్పించి రహస్య వసతి గృహాల్లో బంధించింది. ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా ప్రమాదకరమైన హార్మోన్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తూ.. బయట ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా ఒక్కో యువతిపై రూ.3 లక్షల వరకు దండుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంది. నకిలీ గుర్తింపు కార్డులు, బోగస్ అఫిడవిట్లతో చట్ట నిబంధనలకు తూట్లు పొడిచింది. 

ఏకకాలంలో మెరుపు దాడులు

విశ్వసనీయ సమాచారంతో ప్రకాశ్​నగర్, ఎర్రగడ్డ, సరూర్ నగర్, గోపాలపురం ప్రాంతాలపై బేగంపేట, సరూర్​నగర్ పోలీసులు, మల్కాజ్​గిరి ఎస్​వోటీ బృందాలు శుక్రవారం రాత్రి ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించి పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన 49 మంది యువతులను రక్షించినట్లు సీపీ తెలిపారు. బాధిత యువతుల్లో ఇద్దరు గర్భిణులని తేలింది. 

ఈ దందాలో కీలక సూత్రధారులతోపాటు సబ్ ఏజెంట్లు, ఏఆర్టీ కోఆర్డినేటర్లు కలిపి మొత్తం 10 మంది అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌, అతని సహాయకుడు శేఖర్, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను, జెప్రే ప్రదీప్, విజయ్ భగవాన్ రావు సాలుంకే, పాత నేరస్థుడైన క్యాటరింగ్ సరఫరాదారు పంకజ్ సోనీ, షేక్ పర్వీన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 ఇంజెక్షన్ వయల్స్, సూదులు, సిరంజీలు, భారీగా మందులు, అనుమానాస్పద డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఫెర్టిలిటీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ రాకెట్​ను ఛేదించిన డీసీపీలు శ్రీధర్, మనోహర్, ఏసీపీలు గోపాలకృష్ణమూర్తి, రవీందర్ రెడ్డి, ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు సైదులు, శివలింగం, శ్రీశైలం, శేఖర్ బృందాలను అభినందించారు.