మీరు భూబకాసురులైతే.. సీఎం రేవంత్ భూ రక్షకుడు : విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌

మీరు భూబకాసురులైతే.. సీఎం రేవంత్ భూ రక్షకుడు : విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌
  •  బీఆర్ఎస్ నేతలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో కల్వకుంట్ల కుటుంబం భూబకాసురుల్లా మారి లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టిందని విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌‌రెడ్డి భూ రక్షకుడిగా మారి, అన్యాక్రాంతమైన, ఆక్రమణలకు గురైన భూములను తిరిగి ప్రభుత్వానికి దక్కేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మరో విప్ విజయ రమణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ భూములను కాపాడటంలో పోరాటం చేశామని బీఆర్‌‌ఎస్‌‌ నేత హరీశ్‌‌రావు బడాయి కబుర్లు చెప్తున్నారని ఆది శ్రీనివాస్‌‌ ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్‌‌ నిజంగానే పోరాటం చేసి ఉంటే 550 ఎకరాల మియాపూర్‌‌ భూముల విషయంలో తీర్పు ఎందుకు ఆలస్యమైందని ఆయన ప్రశ్నించారు. ఆనాడు ఈ భూములపై రేవంత్‌‌రెడ్డి పోరాడితే కక్షగట్టి ఆయనపై కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. కేసీఆర్‌‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌‌ చుట్టూ కంచెలు వేసుకొని ప్రభుత్వ భూములను గాలికొదిలేస్తే, తమ ప్రభుత్వం ప్రగతి భవన్‌‌ కంచెలను తొలగించి, ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడుతూ వాటికి కంచెలు వేస్తోందని స్పష్టం చేశారు.

అనంతరం ప్రభుత్వ విప్‌‌ విజయ రమణారావు మాట్లాడుతూ... మియాపూర్‌‌ భూముల విషయంలో కేసీఆర్‌‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన బంధువు దామోదర్‌‌రావు, గోల్డ్‌‌స్టోన్‌‌ ప్రసాద్‌‌ల ద్వారా వాటిని కొల్లగొట్టే కుట్రలు చేశారని ఆరోపించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్‌‌ కుటుంబ సభ్యులు, బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల ఉన్న వేలాది కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని ఆయన ఫైర్ అయ్యారు.