హైదరాబాద్, వెలుగు: మియాపూర్ భూములు అమ్మేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ఇందుకోసం ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేసి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడితే.. ఆ ఘనతంతా తనదేనని రేవంత్‌రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు.
మియాపూర్ భూముల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు కాపీ అధికారికంగా చేతికి రాకముందే.. ఆ భూములను అమ్మేయాలంటూ సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఎందుకు పరుగులు పెట్టిస్తున్నారని, ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మియాపూర్ కేసు 192 సార్లు విచారణకు వస్తే, అందులో 86 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ స్వయంగా వాదించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగింది కేవలం 11 విచారణలు మాత్రమేనని చెప్పారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణపై రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. మంచిరేవుల గ్రేహౌండ్స్ గోడ కూల్చివేత, జీరో వాల్యూ రిజిస్ట్రేషన్లు, మియాపూర్ భూముల వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంచిరేవులలోని గ్రేహౌండ్స్ భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని కొల్లగొట్టే కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు
