న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్చీఫ్గా అశుతోష్ దీక్షిత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించారు. తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. దాదాపు 42 ఏండ్లపాటు సుదీర్ఘ సేవలందించిన ఏపీ సింగ్ కు రేస్ కోర్స్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో భారత వైమానిక దళం గౌరవ వందనం సమర్పించి వీడ్కోలు పలికింది. అనంతరం ఆయన కొత్త చీఫ్ అశుతోష్ దీక్షిత్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ సిందూర్ లో ఏపీ సింగ్ కీలక పాత్ర పోషించారు.
దీక్షిత్‌కు 4 దశాబ్దాల అనుభవం
1966 డిసెంబర్ 9న జన్మించిన అశుతోష్ దీక్షిత్.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలోని ఫైటర్ విభాగంలో ఆఫీసర్‌గా నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో కమాండ్, స్టాఫ్, శిక్షణ విభాగాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫైటర్ పైలట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా గుర్తింపు పొందారు. మిరాజ్-2000, వివిధ రకాల మిగ్, జాగ్వార్‌తోపాటు పలు రవాణా విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 20 రకాల విమానాలను 3,500 గంటలకు పైగా నడిపారు. దీక్షిత్ ఇప్పటివరకు వాయుసేన మెడల్, విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్ పురస్కారాలు అందుకున్నారు.
