ఆరేండ్ల కొడుకుతో పాటు18వ ఫ్లోర్ నుంచి దూకింది.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి

ఆరేండ్ల కొడుకుతో పాటు18వ ఫ్లోర్ నుంచి దూకింది.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి
  • మహారాష్ట్రలోని పుణెలో విషాదం

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఒక మహిళ హై-రైజ్ బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి తన ఆరేండ్ల కొడుకుతో సహా కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ కు చెందిన మనోజ్ భాంగ్డే ఎరవాడలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా పింప్రి-చించ్‌‌వాడ్‌‌లోని హై ప్రొఫైల్ సొసైటీ సిగ్నేచర్ పార్క్ లో ఏడో అంతస్తులో భార్య ఏక్తా భాంగ్డే, కొడుకు మాధవ్ భాంగ్డేలతో కలిసి అద్దెకు ఉంటున్నారు. 

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 10 గంటలకు మనోజ్ ఆఫీసుకు వెళ్లగా, ఇంట్లో ఏక్త, మాధవ్ మాత్రమే ఉన్నారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందని వెళ్లి చూడగా ఏక్తా, మాధవ్‌‌లు రక్తపు మడుగులో కనిపించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అపార్ట్ మెంట్ 18వ అంతస్తు గ్యాలరీలో ఏక్తా, మాధవ్ ల బూట్లు, చెప్పులు లభించాయి. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు ఏక్తా తన కొడుకు మాధవ్ తో కలిసి 18వ ఫ్లోర్ కు వెళ్లడం కనిపించింది. దీంతో ఏక్తా ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణం కుటుంబ కలహాలా లేక ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.