- ఆ రెండు భవనాలను వైద్యశాఖకు ఇస్తేనే రూ.25 కోట్లు డిపాజిట్ చేస్తా : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
- రూ.25 కోట్లు డీడీ తీసి చూపిస్తే ఆస్పత్రి స్థలానికి జీఓ తెప్పిస్తా: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణంపై ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. తహసీల్దార్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనాలను వైద్య ఆరోగ్య శాఖకు అప్పగిస్తే తాను చెప్పినట్లుగానే ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.25 కోట్లు డిపాజిట్ చేస్తానని, ఆ తర్వాతే పాత భవనాలను కూల్చివేసి సొంత డబ్బులతో కొత్త ఆస్పత్రి కట్టిస్తానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం మీడియా సమావేశంలో ప్రతిసవాల్ విసిరారు.
ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆస్పత్రి బాగున్నప్పటికీ ఎమ్మెల్యే రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, డాక్టర్లు, సిబ్బంది కొరతను తీర్చకుండా సమస్యను దాటవేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కొత్తగా 100 పడకల ఆస్పత్రి కట్టించేందుకు సిద్ధంగా ఉంటే వెంటనే రూ.25 కోట్లతో డీడీ తీసి, దాని జిరాక్స్ కాపీని జతచేసి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.25 కోట్లు డీడీ రూపంలో చూపిస్తే, హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం జీఓ ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. గతంలో వర్షం పడితే నీటితో నిండిపోయేలా ఆస్పత్రులు కట్టి ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడడం లక్ష్మారెడ్డికే చెల్లుతుందని అనిరుధ్ రెడ్డి విమర్శించారు.
