సైబర్ ఫ్రాడ్ సొమ్ముతో రియల్ ఎస్టేట్‌‌..ఆన్‌‌‌‌లైన్‌‌ పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల ఫ్రాడ్

సైబర్ ఫ్రాడ్ సొమ్ముతో  రియల్ ఎస్టేట్‌‌..ఆన్‌‌‌‌లైన్‌‌ పెట్టుబడుల పేరుతో  రూ.26 కోట్ల ఫ్రాడ్
  •  కేరళలోని ఎర్నాకుళంలో
  • అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్​లో స్థిరాస్తులు, విల్లాల నిర్మాణం
  • ఆశ్రిత మెగా సొల్యూషన్స్‌‌ సహా ఐదు కంపెనీల్లో ఈడీ సోదాలు 

హైదరాబాద్‌‌, వెలుగు: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఆన్‌‌లైన్‌‌ పెట్టుబడుల పేరుతో సైబర్‌‌‌‌ మోసాలకు పాల్పడుతున్న ఓ రియల్‌‌ ఎస్టేట్‌‌, కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీ గుట్టురట్టయంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఆశచూపి రూ. కోట్లు వసూలు చేస్తున్న ఆశ్రిత మెగా సొల్యూషన్స్‌‌, ఆశ్రిత ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ యజమాని అల్లంరాజు సత్యనారాయణమూర్తిపై  కొచ్చి ఈడీ కేసు నమోదు చేసింది.

దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌‌లోని సత్యనారాయణమూర్తి ఇంటితో పాటు కుత్బుల్లాపూర్‌‌‌‌, శంషాబాద్‌‌లోని శాతంరాయి సహా మూడు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. డిజిటల్‌‌ ఆధారాలతో పాటు రూ.6.40 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. రూ.14 లక్షలు నిల్వలు ఉన్న 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌‌ చేసింది. ప్లాట్లు, విల్లాలతో కలిపి సుమారు రూ.5 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించింది. వివరాలను శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వెల్లడించింది. 

స్టాక్ మార్కెట్‌‌ ట్రేడింగ్‌‌ పేరిట రూ.26.02 కోట్లు లూటీ

కేరళ ఎర్నాకుళానికి చెందిన ఫార్మా కంపెనీ నిర్వాహకుడు నిమేశ్(49)కి 2023 మార్చిలో టెలిగ్రామ్‌‌, సోషల్‌‌మీడియాలో స్టాక్ మార్కెట్‌‌ ట్రేడింగ్‌‌తో కూడిన సమాచారం వచ్చింది. ఫోన్‌‌ కాల్స్‌‌, టెలిగ్రామ్‌‌ యాప్‌‌ ద్వారా మెస్సేజెస్​పంపారు. www.capitalix.com వెబ్‌‌సైట్‌‌ ద్వారా ట్రేడింగ్‌‌ చేస్తే భారీ రాబడులు పొందవచ్చని ఆశ చూపారు. దీంతో నిమేశ్ 2023 మే 23 నుంచి 2025 ఆగస్ట్‌‌ 29 వరకు రూ.26,02 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇలా వసూలు చేసిన డబ్బుకు హామీ ఇచ్చిన ప్రకారం లాభాలు, అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో ఎర్నాకుళం సైబర్ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా కేరళ కొచ్చి ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసింది.

హైదరాబాద్‌‌లోని ఆశ్రిత గ్రూప్‌‌ ఆఫ్ కంపెనీలకు మనీలాండరింగ్‌‌

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆశ్రిత మెగా సొల్యూషన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, ఆశ్రిత ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్స్‌‌, ఆశ్రిత ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ సహా బీటీఆర్‌‌ ఇండస్ట్రీస్‌‌ అకౌంట్ల పేరిట మనీలాండరింగ్‌‌ జరిగినట్లు ఈడీ గుర్తించింది. సంస్థల వ్యవస్థాపకుడు అల్లంరాజు సత్యనారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగుల పేర్లతో పలు సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నగదు మళ్లించినట్లు తేల్చింది. సైబర్ నేరాలతో కొట్టేసిన సొమ్ముతో  పలు స్థిరాస్తులను కొనుగోలు చేయడంతోపాటు హైదరాబాద్‌‌లో ఒక విల్లా ప్రాజెక్టును కూడా  ప్రారంభించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈడీ11 అకౌంట్లలోని రూ.14 లక్షలు ఫ్రీజ్‌‌ చేసింది.