డ్రోన్ దాడులకు చెక్!..ఐఐటీ హైదరాబాద్‌ తో సీఐఎస్ఎఫ్ కీలక ఒప్పందం

డ్రోన్ దాడులకు చెక్!..ఐఐటీ హైదరాబాద్‌ తో సీఐఎస్ఎఫ్ కీలక ఒప్పందం
  •     డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్నాలజీలో పరిశోధన, ప్రత్యేక శిక్షణ 

హైదరాబాద్, వెలుగు: దేశ కీలక పారిశ్రామిక, వ్యూహాత్మక సంస్థల భద్రతను పటిష్టం చేసేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సాంకేతిక బాట పట్టింది. డ్రోన్ల ద్వారా పొంచి ఉన్న గగనతల ముప్పులను సమర్థంగా తిప్పికొట్టేందుకు ఐఐటీ హైదరాబాద్‌లోని ‘టిహాన్’ (టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్)తో సీఐఎస్ఎఫ్ శనివారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ ప్రాంగణంలో నిసా డైరెక్టర్, ఐజీ హర్‌ప్రీత్ కౌర్ సోహి, టిహాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజలక్ష్మి ఈ పత్రాలపై సంతకాలు చేశారు. 

నిసాలో శిక్షణ పొందే అధికారులకు ‘టిహాన్’ ల్యాబ్‌లో డ్రోన్ల అసెంబ్లింగ్, ఫ్లైట్ ఆపరేషన్లు, అటానమస్ వ్యవస్థలపై స్వల్పకాలిక ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. రాజస్తాన్‌లోని బెహ్రోర్ సీఐఎస్ఎఫ్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రోన్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ’కి టిహాన్ పూర్తి సాంకేతిక సహకారం అందిస్తుంది. విద్యుత్, పెట్రోలియం, బొగ్గు గనులు, అణు పరిశోధనా కేంద్రాలు వంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్న రంగాలకు గగనతల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా ఈ అత్యాధునిక అటానమస్ టెక్నాలజీ పరిశోధనలను క్షేత్రస్థాయి ఆపరేషన్లలోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఐజీ అనిల్ దామోర్, కమాండెంట్ అనిల్ కుమార్, ఏఐజీ సవితోజ్ సింగ్ గిల్ సహా టిహాన్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.