ఇండియా బ్లాక్ ర్యాలీ.. ఢిల్లీవైపు పోటెత్తిన జనం..రాంలీలా మైదాన్ లో ఆర్మీ బలగాల మోహరింపు

ఇండియా బ్లాక్ ర్యాలీ.. ఢిల్లీవైపు పోటెత్తిన జనం..రాంలీలా మైదాన్ లో ఆర్మీ బలగాల మోహరింపు

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా బ్లాక్ తలపెట్టిన మెగా ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు తరలివస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ సహా కూటమి పార్టీల కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎరుపు, పసుపు జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొనేందుకు రామ్‌లీలా మైదానం వైపు కదులుతున్నారు. 

ఇండియాకూటమి సభకు రామ్‌లీలా మైదాన్ సిద్దమైంది. ప్రాంగణం చుట్టూ పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు, నాయకుల కటౌట్లు ఏర్పాటు చేశారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు కార్యకర్తలు, నాయకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 5.30 గంటల నుంచే జనం సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ వెల్లడించారు.

మరోవైపు ర్యాలీకి భారీ భద్రత కల్పించారు. రామ్‌లీలా మైదానానికి వెళ్లే ప్రధాన రహదారులు, కూడళ్లు, కీలక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. ప్రతి గల్లీలో నిఘా ఏర్పాటు చేశారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్, హిమాచల్ భవన్ పరిసరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు, తనిఖీలతో పాటు స్థానికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఇవాళ  (నవంబర్ 1న) ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. కన్నాట్ ప్లేస్ నుంచి మింటో రోడ్ వరకు పాదయాత్ర, అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను తెలియజేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిరసనకు సిద్ధమయ్యాయి.