కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శిల్పారామం సమీపంలోని ఓ పొలం వద్ద నిలిపి ఉంచిన వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో మూడు కార్లు, 11 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ ట్రాలీకి మంటలు అంటుకున్నాయి. వీటిలో సుమారు ఎనిమిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోని నివాసం వద్ద ఈ వాహనాలను నిలిపి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
దాడి వెనుక ఎవరున్నారు?
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కిన పులివెందులలో వాహనాల దహనం మరింత ఉద్రిక్తతకు కారణమైంది.
ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల ప్రమేయం ఉందంటూ కొన్ని రాజకీయ వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, నిందితుల గుర్తింపు, వారి రాజకీయ అనుబంధంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. పోలీసులు దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెల్లడించాల్సి ఉంది.
ఓటర్లలో భయాందోళనలు.. పోలీసులకు సవాల్
పోలింగ్‌కు ముందు రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
