- బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు
- అడ్డుకున్న మరో విద్యార్థినిపై కూడా అటాక్
- ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం
- వైద్యం కోసం బాలికను బెంగళూరుకు తరలింపు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రంపం సీజ్
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. రాప్తాడు మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది( 21) మొద్దులు కోసే రంపం మిషన్‌తో దాడి చేశాడు. నేరుగా స్కూల్ ల్లోకి వచ్చిన నిందితుడు.. తరగతి గదిలోనే పిల్లలందరితోపాటు టీచర్ చూస్తుండగానే ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డాడు. ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
అటాక్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం దాడికి ఉపయోగించిన రంపం మెషీన్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితుడిని ధర్మవరం మండలానికి చెందిన హేమంత్ గా పోలీసులు గుర్తించారు. ‘‘పిల్లలకు మ్యాథ్స్ చెబుతుంటే ఓ దుండగుడు క్లాస్ లోకి వచ్చాడు. నేరుగా అమ్మాయి వద్దకు వెళ్లి రంపంతో చేశాడు. నేను షాక్‌లోకి వెళ్లిపోయా. ఏం జరుగుతోందో అర్థం కాలేదు’’ అని క్లాస్ టీచర్ పేర్కొన్నారు.
బాలిక బెంగళూరుకు తరలింపు..నిందితుడు అరెస్ట్
ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం అధికారులు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బాలికను వేగంగా బెంగళూరు తీసుకెళ్లేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మరోవైపు, ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలికపై దాడి చేసిన ఉన్మాది హేమంత్ ను పోలీసులు ధర్మవరంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్వస్థలం ధర్మవరం మండలం నాగలూరుకాగా..అతడు బాలికకు మేనమామ అవుతాడని, కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తున్నట్లు సమాచారం. కాగా...స్కూల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హెచ్ఎంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్లాస్ రూములోనే రంపంతో అత్యంత అనుమానుషంగా దాడి జరగడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్సపై అధికారులతో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బాధితురాలి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆడపిల్లల భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉన్మాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. దాడిని ఏపీ హోంమంత్రి అనిత తీవ్రంగా ఖండించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, పోలీసులను సంప్రదించి సహాయం కోరాలన్నారు.
