- అమ్మే సంస్థలోనూ, కొనే సంస్థలోనూ ‘మహాలింగం’ ఉన్నారని వెల్లడి
- ఒక్క రోజులోనే షేర్ల కనీస ధరలు ఎందుకు తగ్గాయని నిలదీత
- కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేసిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వాటాల విక్రయం వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలు (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) దాగి ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఎల్ఐసీ డైరెక్టర్గా ఉన్న గురుమూర్తి మహాలింగమే.. కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ అనుబంధ సంస్థ ‘థామస్ కుక్ ఇండియా’ బోర్డులోనూ 7 నెలల పాటు సభ్యుడిగా కొనసాగారని గుర్తుచేసింది.
అంటే ఐడీబీఐ వాటా అమ్మే సంస్థ(ఎల్ఐసీ)లో నిర్ణయాధికారిగా ఉన్న వ్యక్తే.. కొనే సంస్థ(ఫెయిర్ఫాక్స్)తో కూడా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారని తెలిపింది. ఇది అనుమానాలకు తావిస్తోందని, మోదీ హయాంలో జరుగుతున్న ఏ పెద్ద ఒప్పందంలోనూ పారదర్శకత లేదని మండిపడింది. శనివారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా ఐడీబీఐ బ్యాంక్ నేపథ్యాన్ని గుర్తుచేస్తూ, ఫెయిర్ఫాక్స్ సంస్థకు విక్రయించడంపై మోదీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
అమ్మేయాల్సిన అవసరం ఏముంది?
గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 10 వేల కోట్ల లాభం ఆర్జించి, పటిష్టంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకును ఉన్నట్టుండి ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జైరామ్ రమేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఐడీబీఐ వాటాల విక్రయం ప్రక్రియలో షేర్ల కనీస ధరను భారీగా తగ్గించడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఒక్కో షేరుకు తొలుత నిర్ణయించిన కనీస ధరను రూ. 94.42 నుంచి రూ. 75.99కి ఎందుకు తగ్గించారని నిలదీశారు.
ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే సుమారు రూ. 8,800 కోట్లు తక్కువ ధరకు ఎందుకు విక్రయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సరిగ్గా ఫెయిర్ఫాక్స్ తన బిడ్ తెరిచిన రోజే ధరను ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త ధరను నిర్ణయించిన అధికారులకు, ఫెయిర్ఫాక్స్ సమర్పించిన బిడ్ విలువ ముందే తెలుసనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఐడీబీఐ అమ్మకపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పది మంది మాజీ ప్రభుత్వ, నియంత్రణ సంస్థల అధికారులను ఫెయిర్ఫాక్స్ గ్రూప్ కంపెనీల్లో నియమించడం వెనుక మతలబు ఏమిటని జైరామ్ ప్రశ్నించారు.
రూల్స్ అన్నీ పక్కాగా పాటించాం: నిర్మల
కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్నిర్మాణంలో అన్ని నిబంధనలనూ పక్కాగా పాటించామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకులు దుర్భర స్థితిలోకి వెళ్లాయని.. పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇవ్వడం వల్ల ఐడీబీఐ భారీ నష్టాలను చవిచూసిందన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే రూ. 25,000 కోట్లకు పైగా మూలధనాన్ని సమకూర్చి, బ్యాంకును లాభాల బాటలోకి తెచ్చిందని కౌంటర్ ఇచ్చారు. అలా పునరుద్ధరించబడిన ఐడీబీఐ బ్యాంక్ ఇప్పుడు మరింత వృద్ధి సాధించేందుకు సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
