హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో 14హోటళ్ల లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో 14హోటళ్ల  లైసెన్సులు సస్పెండ్
  •     తాజ్ ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా ప్యాలెస్‌‌‌‌‌‌‌‌ సహా 8 హోటళ్లకు నోటీసులు
  •     హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు 
  •     బొద్దింకలు, ఈగలు, కుళ్లిన కూరగాయలు

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గోల్కొండ, చార్మినార్ జోన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు శనివారం సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రముఖ హోటళ్ల కిచెన్ల అపరిశుభ్రత బట్టబయలైంది. 22 ప్రత్యేక బృందాలతో మొత్తం 22 హోటళ్లలో తనిఖీలు చేపట్టగా, నిబంధనలు విస్మరించిన 14 హోటళ్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. తాజ్ ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా ప్యాలెస్, పిస్తా హౌస్, మరో 8 హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీ చేసిన మెజారిటీ హోటళ్ల కిచెన్లలో ఎలుకల మలం, బొద్దింకలు, ఈగలు, కుళ్లిన కూరగాయలు, ఫంగస్ పట్టిన ముడిసరుకులు దర్శనమిచ్చాయి. ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌లలో వెజ్, నాన్-వెజ్ కలిపి నిల్వ చేయడం, గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగించడం గుర్తించి, సుమారు 544 కిలోల కుళ్లిన సరుకులను పారబోయించారు. కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపారు. 

టోలిచౌకి బృందావన్ కాలనీలోని హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడుపి వెజ్, సంతోష్ నగర్‌‌‌‌‌‌‌‌ లోని లక్కీ రెస్టారెంట్, శాలిబండలోని షా గౌస్ కేఫ్, నయాపూల్‌‌‌‌‌‌‌‌లోని హోటల్ నయాబ్, గుడిమల్కాపూర్‌‌‌‌‌‌‌‌లోని శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా, సిద్దిఖ్ కబాబ్ సెంట్రల్ కిచెన్, టోలిచౌకిలోని అల్ సబా హోటల్, దిల్​సుఖ్ నగర్‌‌‌‌‌‌‌‌లోని మెహఫిల్ రెస్టారెంట్, సంతోష్ నగర్‌‌‌‌‌‌‌‌ లోని హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడుపి వెజ్, మాసబ్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ లోని డైన్ హిల్ రెస్టారెంట్, మలక్‌‌‌‌‌‌‌‌ పేటలోని సోహైల్ రెస్టారెంట్, మలక్‌‌‌‌‌‌‌‌పేట అక్షయ టిఫిన్స్, ఎంజేఆర్ రోడ్డులోని హోటల్ వెంకటేశ్వర, రేతిబౌలి సాలార్జంగ్ కాలనీలోని అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి.

ఈ హోటళ్లకు షోకాజ్ నోటీసులు...

ఇంజిన్ బౌలిలోని తాజ్ ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా ప్యాలెస్, చార్మినార్ అలీజా కోట్లాలోని హోటల్ సబ్జీ, శాలిబండ పిస్తా హౌస్ రెస్టారెంట్, సంతోష్ నగర్ స్వీకార్ హోటల్, చార్మినార్‌‌‌‌‌‌‌‌ లోని మండి ఎట్ 36 అరేబియన్ కిచెన్, మాసబ్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌లోని గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్, టోలిచౌకిలోని ఇంపీరియల్ మల్టీకుజిన్ రెస్టారెంట్, లక్డీకాపూల్ బజార్‌‌‌‌‌‌‌‌ఘాట్ మెయిన్ రోడ్డులోని తైబా బేకరీలకు అధికారులు షోకాజ్​ నోటీసులు ఇచ్చారు. 

న్యూ బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి సప్తమి గ్రాండ్‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌లో.. 
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్​లోని కంటోన్మెంట్ పరిధి న్యూ బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లిలో గల సప్తమి గ్రాండ్‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌లో హెల్త్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ శానిటేషన్‌‌‌‌‌‌‌‌, ఫుడ్‌‌‌‌‌‌‌‌సేఫ్టీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ రెస్టారెంట్​లో ఆహారం తిని ఇటీవల పది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతోపాటు రెస్టారెంట్​లో అపరిశుభ్ర వాతావరణంలో కాలం చెల్లిన ముడి సరుకులతో వంటలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో అధికారులు కిచెన్‌‌‌‌‌‌‌‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశుభ్రత లోపించడంతోపాటు ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన వంటలు, ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ డేట్‌‌‌‌‌‌‌‌ముగిసిన సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, ల్యాబ్‌‌‌‌‌‌‌‌ కు పంపించారు. నివేదిక వచ్చాక నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.