- పంప్ హౌజ్ నిర్మాణంతో డ్యామ్ భద్రతకు ప్రమాదం లేదు
- భారీ బండరాయిని పేలుళ్లు లేకుండా రసాయన పద్ధతుల్లో తొలగిస్తున్నాం
- పంప్ రూమ్ నిర్మాణ స్థలాన్ని 100 మీటర్ల మేర పక్కకు మార్చి పనులు
- ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శివధర్మతేజ్, జలమండలి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మహేశ్‌కుమార్
మెదక్/ కొండపాక, వెలుగు : సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామ శివారులో చేపడుతున్న గోదావరి తాగునీటి సరఫరా పథకం నూతన పంప్‌హౌస్ నిర్మాణంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శివధర్మతేజ్, జలమండలి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ ఎస్డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మల్లన్న సాగర్ ప్రాంతంలో పర్యటించి బండరాళ్ల బ్లాస్టింగ్ లతో ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం పంప్ హౌజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఇరిగేషన్, జలమండలి అధికారులు మీడియాతో మాట్లాడారు. మల్లన్న సాగర్ డ్యామ్‌కు సుమారు 293 మీటర్ల దూరంలో ప్రభుత్వ అనుమతులతో పంప్ హౌజ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో భాగంగా గతంలో నియంత్రిత పేలుళ్లు (కంట్రోల్ బ్లాస్టింగ్) మాత్రమే చేపట్టినట్లు వివరించారు. నిర్మాణ ప్రాంతంలో ఎదురైన భారీ బండరాయిని పేలుళ్ల ద్వారా కాకుండా, ప్రత్యేక రసాయన పద్ధతుల్లో ఎలాంటి కుదుపులు, ప్రకంపనలు తలెత్తకుండా తొలగించనున్నట్టు వెల్లడించారు.
నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పంప్ రూమ్ నిర్మాణ స్థలాన్ని సుమారు 100 మీటర్ల మేర పక్కకు మార్చి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ డ్యామ్‌తో పాటు పంప్‌హౌస్ నిర్మాణ ప్రాంతంలో రిజర్వాయర్ వైపు ఎలాంటి నీటి లీకేజీలు గుర్తించలేదని స్పష్టం చేశారు. డ్యామ్ భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన జాగ్రత్తలతో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
