హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు ఈ నెల 4 ఈ–-లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా కేటాయించిన ఫ్లాట్లలో రద్దయిన వాటిని తిరిగి అర్హులకు కేటాయించేందుకు లాటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. హౌసింగ్ శాఖ యూట్యూబ్ చానల్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఓఆర్ఆర్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో (కంటోన్మెంట్ మినహా) 480 ఇండ్ల చొప్పున నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
లాటరీలో ఎంపికైన కొందరు ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో నివసించకపోవడం, డబ్బులు చెల్లించలేమని చెప్పడం, ఇప్పటికే సొంత ఇల్లు ఉండటం వంటి కారణాలతో వారి కేటాయింపులు రద్దయ్యాయని గౌతమ్ తెలిపారు. ఈ ఖాళీలను ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులతో భర్తీ చేస్తున్నామన్నారు. కొంతమంది దరఖాస్తుదారులు తాము నివసించే నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గతంలో నిర్వహించిన లాటరీలో వారి పేర్లను చేర్చలేదన్నారు. దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల ఆధారంగా జియోకోడ్స్ సేకరించి, గూగుల్ మ్యాప్స్ ద్వారా వారు ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తారో గుర్తించామని, వాటి ఆధారంగా ఖాళీల భర్తీకి నిర్వహించే మాప్‌అప్ లాటరీలో వారి పేర్లను చేర్చనున్నట్లు చెప్పారు.
