- 21.7 శాతానికి మార్కెట్ వాటా
- క్విక్కామర్స్తో మరింత జోరు
- తగ్గుతున్న పెద్ద కంపెనీల సేల్స్
న్యూఢిల్లీ: సబ్బులు, షాంపూలు, బిస్కెట్ల వంటివి తయారు చేసే ఫాస్ట్మూవబుల్కన్జూమర్గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలకు తమ బ్రాండ్లు, ఉత్పత్తులు కంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అతిపెద్ద బలం. ప్రతి షాపుకు వస్తువులను పంపించే సామర్థ్యం వీటికి సొంతం. ఈ పంపిణీ వ్యవస్థ లేక జెన్ జీ/డిజిటల్ బ్రాండ్లు ఇబ్బందిపడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త తరం బ్రాండ్లు షాపుల్లోకి చొచ్చుకుపోతున్నాయి.
రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ బిజోమ్ నివేదిక ప్రకారం.. 2026 తొలి ఆర్నెళ్లలో కిరాణా మార్కెట్లో కొత్త కన్జూమర్ బ్రాండ్ల వాటా 14.8 శాతం నుంచి 21.7 శాతానికి పెరిగింది. పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీల వాటా 85.2 శాతం నుంచి 78.3 శాతానికి పడిపోయింది. ఈ జోష్ ఇటీవల మరింత పెరిగింది. తాజా సెప్టెంబర్ క్వార్టర్లోనే జెన్జీ బ్రాండ్లు తమ కిరాణాల్లో ఉనికిని 200 బేసిస్ పాయింట్లు పెంచుకున్నాయి. పాత కంపెనీలు పట్టణ ప్రాంతాల్లో 1.9 శాతం దుకాణాలను కోల్పోగా, గ్రామాల్లో మాత్రం 2.3 శాతం పెంచుకోగలిగాయి.
క్వాలిటీ ఫస్ట్
సైన్స్ ఆధారిత, నాణ్యమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరగడమే ఈ మార్పుకు ప్రధాన కారణం. గతంలో ఖరీదైన కొత్త తరం ఉత్పత్తులను అమ్మడానికి కిరాణాలు వెనుకాడేవి. ఇప్పుడు కస్టమర్లు నేరుగా అడుగుతుండటంతో వాటిని దుకాణాల్లో ఉంచడానికి ఆసక్తి చూపుతున్నారు. గత ఐదేళ్లలో హెచ్యూఎల్, ఐటీసీ, మారికో లాంటి ఎఫ్ఎంసీజీలు డజనుకు పైగా డిజిటల్ బ్రాండ్లను కొనుగోలు చేశాయి. హెచ్యూఎల్ మినిమలిస్ట్, మారికో ప్లిక్స్, ఐటీసీ యోగా బార్ లాంటి సంస్థల కొనుగోలు ఇందుకు ఉదాహరణలు.
ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు చేరువై, క్రమంగా కిరాణా దుకాణాలకు విస్తరిస్తున్న ప్రముఖ డిజిటల్ బ్రాండ్లలో మామా ఎర్త్ అత్యంత ముఖ్యమైనది. ఈ బ్రాండ్సబ్బులు, షాంపూల వంటి చిన్న దుకాణాల్లోనూ విరివిగా లభిస్తున్నాయి. ప్లమ్ గుడ్నెస్, ఎంకెఫిన్, షుగర్ కాస్మెటిక్స్, బాంబే షేవింగ్ కంపెనీ కూడా దూసుకెళ్తున్నాయి.
ఆహార ఉత్పత్తుల విభాగంలో పేపర్ బోట్ బ్రాండ్ కస్టమర్ల నమ్మకం సంపాదించింది. చిన్న సంస్థల ఉత్పత్తులకు పెద్ద సంస్థల పంపిణీ వ్యవస్థ తోడవడంతో ఈ బ్రాండ్లు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీనివల్ల ఇరు వర్గాలకూ ప్రయోజనం ఉంటోంది.
కొత్త బ్రాండ్లకు సవాళ్లూ ఉన్నాయ్
ప్రస్తుతం కొత్త బ్రాండ్ల దూకుడు బాగానే ఉన్నా, పెద్ద కంపెనీలను దీర్ఘకాలంలో తట్టుకుంటాయా లేదా ? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. పంపిణీ ఖర్చు, గోదాముల నిర్వహణ, కమీషన్ల వల్ల మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉంది. కిరాణాలకు ఎఫ్ఎంసీజీ సంస్థలకు ఉన్న బంధాన్ని కొత్త బ్రాండ్లు అంత సులభంగా విడగొట్టలేవు.
పెద్ద కంపెనీలు తమ డిజిటల్ సేవలను మరింత మెరుగుపరుస్తూ పోటీని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ధరలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఒకటి మాత్రం నిజం..ఎఫ్ఎంసీజీ అడ్డాలో కొత్త తరం బ్రాండ్లు సంచలనం సృష్టిస్తున్నాయని బిజోమ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
