- క్యాన్సర్ మందుల రేట్ల తగ్గింపు తాత్కాలికమేనా?..
- గతంలో ఇలానే తగ్గించినా, తర్వాత పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం 137 క్యాన్సర్ మందుల ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం రోగులకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ ప్రయోజనం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో కూడా ప్రభుత్వం 42 క్యాన్సర్ మందులపై 30శాతం ట్రేడ్ మార్జిన్ పరిమితి విధించి ధరలను తగ్గించింది. అయితే, ఆ తర్వాత కాలంలో ఎక్కువ శాతం మందులపై మార్జిన్లు ఏకంగా 100శాతం నుంచి 700శాతం వరకు ఎగబాకినట్లు తాజా విశ్లేషణలో తేలింది.
ఈ మార్జిన్లను పర్యవేక్షించే ఒక నియంత్రణ వ్యవస్థ లేకపోతే ప్రస్తుత ధరల తగ్గింపు కూడా తాత్కాలికమే అవుతుందని ఆల్-ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్ (ఏఐడీఏఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తాజా జాబితాలోని 137 మందులలో 34 మందులు 2019 నాటి జాబితాలోనూ ఉన్నవే. వాటిలో చాలా బ్రాండ్లు మళ్లీ భారీ మార్జిన్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఉదాహరణకు, 'పెమెట్రెక్స్డ్' ఇంజెక్షన్ ఎంఆర్పీ 2019లో రూ.7,000 నుంచి రూ.800కి తగ్గగా, తాజా ఉత్తర్వుల్లో అది రూ.1,095 నుంచి రూ.297కి తగ్గింది. విదేశీ పేటెంట్ కంపెనీలు మాత్రం ధరలను తగ్గించడంలో పెద్దగా చొరవ చూపడం లేదు.
నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్న తాజా నిర్ణయం ప్రకారం ఎంఆర్పీలపై 70శాతం వరకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. సవరించిన 643 డ్రగ్ ప్యాక్లలో 159 ప్యాకులపై పైసా కూడా తగ్గలేదు. కీట్రూడా (రూ.2.16 లక్షలు), టాగ్రిస్సో (రూ.4.16 లక్షలు), కోసెలూగో (రూ.10 లక్షలకు పైగా) వంటి ఖరీదైన పేటెంట్ మందుల ధరలు యథాతథంగానే ఉన్నాయి. ఎంఆర్పీని ఒకసారి తగ్గించడం కాకుండా, ట్రేడ్ మార్జిన్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆరోగ్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
