హైదరాబాద్, వెలుగు: రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలు, అవినీతిని అడ్డుకునేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ కఠిన చర్యలకు దిగుతున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి(డీఎస్వో)ని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా మళ్లించడం, గ్రేడ్-ఏ సన్న వడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి అంశాలపై విజిలెన్స్ నివేదికలు అందడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు శాఖ వెల్లడించింది.
అధికారుల పర్యవేక్షణ లోపం, తప్పనిసరిగా నిర్వహించాల్సిన నెలవారీ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టకపోవడం వల్లే అక్రమాలకు అవకాశం ఏర్పడినట్లు విచారణలో గుర్తించారు. ఈ నిర్లక్ష్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ టార్గెట్‌పై ప్రభావం చూపడంతో పాటు సర్కారుకు ఆర్థికంగా నష్టం కలిగించినట్లు పేర్కొన్నారు. బకాయిలు ఉన్న మిల్లర్లతో కుమ్మక్కవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని సివిల్ సప్లయ్స్ హెచ్చరించింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే ఉద్యోగులపై కఠిన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ధాన్యం తరలింపు, నిల్వలపై నిఘా పెట్టేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు.
