అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలి : ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్

అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలి : ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపు, అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆఫీసర్లను ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా శనివారం అరణ్య భవన్‌‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ పనితీరు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణతోపాటు ప్రభుత్వం వద్ద పెండింగ్‌‌లో ఉన్న పలు కీలక ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించారు.

క్షేత్రస్థాయిలో అటవీ సంపద రక్షణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. ఫీల్డ్ లెవల్ సిబ్బందికి కొత్త వాహనాల కొనుగోలు, సెక్యూరిటీ కోసం ఆయుధాలు సమకూర్చడంతో పాటు 20 అటవీ స్టేషన్లలో వసతుల కల్పన కోసం సుమారు రూ.65 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ, అటవీ, -పోలీస్, -రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కోసం సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ దృష్టికి తెచ్చారు.