హైదరాబాద్, వెలుగు: మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 17న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని మోడల్ స్కూల్స్ జేఏసీ హెచ్చరించింది. సమస్యల పరిష్కారం కోసం జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో చేపట్టిన దశలవారీ ఆందోళనలు శనివారం రెండో రోజు కూడా కొనసాగాయి. స్కూళ్లలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్-జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు భూతం యాకమల్లు, తరాల జగదీశ్, కొండయ్య, రాజు జాదవ్, విఠల్, అరవింద్ ఘోష్, వేణుగోపాల్ రెడ్డి, రాము, రూపాస్ మాట్లాడారు.
మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు తక్షణమే 010 పద్దు ద్వారానే వేతనాలు చెల్లించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సర్వీసులో ఉండి మరణించిన టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, గ్రాట్యుటీతో పాటు ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. టీజీటీ ఉపాధ్యాయులకు రావాల్సిన నోషనల్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న ఐదు విడతల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోను అమలు చేసి, అర్హులైన ఉపాధ్యాయులందరికీ వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
