- పరిమితిని దాటి పోయిన ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా
- రెండు నెలల్లోనే 1,600 శాతం పెరిగిన పొల్యూషన్
- సూర్యాపేట, నిజామాబాద్, ములుగులో సమస్య తీవ్రం
- శుద్ధి చేయని మురుగంతా నేరుగా ఈ రెండు నదుల్లోకే
- వానల్లేక ఫ్లష్ కాని వ్యర్థాలు.. పొంచి ఉన్న రోగాల ముప్పు
- సీడబ్ల్యూసీ వాటర్ క్వాలిటీ రిపోర్టులో కీలక అంశాల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి జీవనాడులైన కృష్ణా, గోదావరి నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. మనుషులు, జంతువుల మల వ్యర్థాల్లో ఉండే ‘ఫీకల్ కోలిఫామ్’ బ్యాక్టీరియా ఈ రెండు నదుల్లో పరిమితికి 320 రెట్లు ఎక్కువగా పేరుకుపోయింది. ప్రతి 100 మిల్లీలీటర్ల నీటిలో 500 ఎంపీఎన్ (మోస్ట్ ప్రాబబుల్ నంబర్) వరకే ఉండాల్సిన ఈ బ్యాక్టీరియా, ఏకంగా 1.60 లక్షల ఎంపీఎన్ నమోదైంది. జూన్లో 9,200గా ఉన్న ఈ సంఖ్య ఆగస్టు నాటికి 1,600 శాతం పెరిగింది. సూర్యాపేట, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తాజాగా విడుదల చేసిన వాటర్ క్వాలిటీ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. పట్టణాల మురుగును శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలడం, ఈ ఏడాది వానల్లేక వరదలు రాకపోవడంతో వ్యర్థాలు కొట్టుకుపోకుండా పేరుకుపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా కోట్ల మంది తాగునీటికి ఈ నదులే ఆధారం కావడంతో రోగాల ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
రెండు నెలల్లో 17 రెట్లు
జూన్లో 9,200 ఎంపీఎన్గా ఉన్న మల బ్యాక్టీరియా, ఆగస్టు నాటికి 1.60 లక్షలకు చేరింది. అంటే కేవలం రెండు నెలల్లోనే కాలుష్యం 1,600 శాతం పెరిగింది. కృష్ణా పరివాహకంలోని సూర్యాపేట, గోదావరి పరివాహకంలోని నిజామాబాద్, ములుగు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో 92 వేల ఎంపీఎన్ నమోదైంది. ఇది పరిమితి కంటే 180 రెట్లు ఎక్కువ. వలిగొండ దగ్గర మూసీలోనూ పరిమితికి మించి మల బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
సిటీ నీళ్లకూ ఈ నదులే దిక్కు
కృష్ణా, గోదావరి బేసిన్లలోని పట్టణాలు, పల్లెలకు ఈ నదుల నీళ్లనే శుద్ధి చేసి సరఫరా చేస్తారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల్లో 90 శాతం ఈ రెండు నదులపైనే ఆధారపడి ఉంది. దీంతో నదుల్లో ఇంత భారీగా మల వ్యర్థాలు చేరడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లోని డ్రైనేజీ నీటిని శుద్ధి చేయకుండానే వాగుల ద్వారా నదుల్లోకి వదులుతుండడమే పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. రామగుండం, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం వంటి ప్రధాన పట్టణాల్లో సరిపడా మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) లేవు. ఉన్నవీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. రామగుండం వంటి చోట్ల నదీ తీరానికి దగ్గర్లోనే మున్సిపల్ డంపింగ్ యార్డులు ఉండడంతో, వానలకు ఆ చెత్తంతా నదిలోకి కొట్టుకొస్తోంది.
వానల్లేక వ్యర్థాలు కొట్టుకుపోలె..
మామూలుగా అయితే వానాకాలంలో వచ్చే భారీ వరదలకు ఈ వ్యర్థాలన్నీ కొట్టుకుపోతాయి. కానీ ఈ ఏడాది సరైన వానలు లేక, రెండు నదుల్లోనూ పెద్ద వరదలు రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరదలు మల వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి సరిపోలేదని, అందుకే అవి నదుల్లో పేరుకుపోయాయని నిపుణులు చెబుతున్నారు.
రోగాల ముప్పు
నీళ్లలో ఫీకల్ కోలిఫామ్ పెరిగితే కలరా, టైఫాయిడ్, తీవ్రమైన డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, హెపటైటిస్ (కామెర్లు), పరాన్నజీవుల ఇన్ఫెక్షన్ల వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు ముప్పు మరింత ఎక్కువని చెబుతున్నారు.
