- నిజాం కాలేజీ నుంచి ఎంజే మార్కెట్ వరకు నడవనున్న షా
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో జరిగే మహా పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లి, మధ్యాహ్నం 2:10 నుంచి 3:45 గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
అనంతరం 3:55 గంటలకు నిజాం కాలేజ్ ఎదుట ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5:05 గంటలకు మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి యాత్రను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. సభ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
5న కరీంనగర్‌కు నితిన్ నబీన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నవంబరు 5న తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తలపెట్టిన మహా పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
