- తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతుల విజ్ఞప్తి
మెదక్/ కొల్చారం/తొగుట, వెలుగు: మెదక్, సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసింది. మెదక్ మండలం మాచవరం, కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి, చౌరస్తా, అప్పాజిపల్లి, చిన్నఘనపూర్ గ్రామాలతోపాటు తొగుట, మిరుదొడ్డి , రాయపోల్ మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల వద్ద, రోడ్ల మీద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొల్చారం మండల కేంద్రంలో గంట పాటు కుండపోత వాన కురియగా పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ప్రదేశం జలమయమైంది. పెద్ద మొత్తంలో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. వడ్ల కుప్పల చుట్టూ నీరు నిలిచింది. నీటిని తొలగించేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.
తొగుట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన వరి ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయి బురదలో కలిసింది. ఘనపూర్ లో రైతులు ఆరబోసిన మక్కజొన్న ధాన్యం తడిసిముద్దైంది. ఆయా చోట్ల దాదాపు వారం రోజుల కిందట నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు రైతులు వడ్లు తెచ్చి ఆరబోస్తుండగా ఇంతవరకు తూకం మొదలు పెట్టలేదు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ అధికారులు టార్పాలిన్ లు సరఫరా చేయలేదు. దీంతో ఆయా చోట్ల భారీగా ధాన్యం తడిసింది. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
పిడుగు పాటుతో గొర్రెల కాపరి మృతి
పెన్ పహాడ్, వెలుగు : పిడుగు పాటుతో గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మాచారం గ్రామంలో జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుబాని నాగరాజు(32) శుక్రవారం రాత్రి గొర్రెల మంద వద్ద ఉండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య దూబని సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ తెలిపారు.
